బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ కార్యక్రమం ప్రస్తుతం జనాధరణ కరువై సోసోగా సాగిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందుకు ప్రధానంగా వినిపిస్తున్న కారణం హౌస్‌లో అంతగా తెలిసిన ముఖాలు లేకపోవడం. ఒకప్పుడు ఉన్న బిగ్ బాస్ క్రేజ్‌కి ఇప్పుడు ఆ షోకి వస్తున్న రేటింగ్‌కి అస్సలు పొంతన లేదు. సరే వచ్చిన వాళ్లు ఏమైనా ఆడతారా అంటే అదీ లేదు. మొదటి రెండు వారాలకే నాగార్జున అందరినీ ఉతికి ఆరేశాడు. అసలు ఆడటానికి వచ్చారా? చిల్ అవ్వడానికా అని క్లాస్ పీకాడు. మీ ఆట చూస్తుంటే మాకు నీరసం వస్తోంది అంటూ ఫైర్ అయ్యాడు. అప్పటి నుంచి హౌస్‌లో కాస్త కదలికలు కనిపించాయి. కానీ, మళ్లీ అంతా షరా మామూలే అన్నట్లుగా ఉంది. కానీ, ఒక గీతూ మాత్రం నాగార్జున చేత చప్పట్లు కొట్టించుకుంది. నిజానికి ఆమె కూడా లేకపోతే ఆ షోకి ఈ మాత్రం ఆదరణ కూడా రాదని టాక్ వినిపిస్తోంది.
గీతూ రాయల్ స్ట్రాటజీలు, గేమ్ ప్లేని మెచ్చుకుంటున్నారు.. భజన చేస్తున్నారు అంతా బాగానే ఉంది. కానీ, ఆమె గేమ్ ఎలా ఆడుతుందో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే హౌస్‌లో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మొదటివారంలోనే ఆమె స్ట్రాటజీలు చూపించి హౌస్‌మేట్స్ ఫ్యూజులు ఎగరకొట్టేసింది. గేమ్ ఆడేందుకు పెట్టిన కార్డులను గుత్తగా పట్టుకుని తన దగ్గర దాచుకుంది. టీషర్టులో పెట్టుకుని ఆడతానంటూ కామెంట్ చేసింది. అబ్బాయిలు ఎవరైనా వచ్చి వాటికోసం నా టీషర్టులో చేయి పెట్టినా పర్వాలేదంటూ ఒక కామెంట్ పాస్ చేసింది. హౌస్‌లో మొదటి గొడవ స్టార్ట్ చేసింది కూడా గీతూనే. ఆమెకు హౌస్‌లో అందరితో పంచాయితీలే. సొంత తల్లిదండ్రులు వచ్చినా వాళ్లని ఓడించి గెలుస్తానంటూ కామెంట్ చేసింది.
మాటల విషయానికి వస్తే ఎవరికీ మర్యాద ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా నేను వయసుని బట్టి మర్యాద ఇచ్చే టైప్ మనిషిని కాదంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తుంది. తల్లి ప్రేమను కుక్కతో పోల్చి మాట్లాడుతూ రెచ్చిపోతోంది. హౌస్‌లో ఉన్నది ఎవరైనా సరే నేను గెలవడమే నా లక్ష్యం అంటూ అందుకు ఎవరినైనా రెచ్చగొట్టి పిచ్చి వాళ్లను చేస్తోంది. రెండోవారంలో రూల్స్ అనే మాట లేకుండా తన ఆట తనకి నచ్చినట్లుగా ఆడేసింది. రూల్స్, రూల్ బుక్ అనే పదాలకు తావు లేకుండా తన గేమ్ రూల్స్ తానే రాసుకుంది. ఏమైనా ప్రశ్నిస్తే రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తోంది. ఆమెతో పెట్టుకోలేక ఇంట్లోని సభ్యులు కూడా ఒక మాట మనకెందుకులే అంటూ తప్పుకుంటున్నారు. రేవంత్ లాంటి వాళ్లైతే అశుద్ధం మీద రాయేస్తే మనమీదే పడుతుంది. నేను అలా రాయేసే టైప్ కాదంటూ కుండ బద్దలు కొట్టేశాడు.
గీతూ రాయల్.. తనకు రైట్ అనిపించిందే మాట్లాడుతుంది. ఆ మాట వల్ల ఎవరైనా హర్ట్ అవుతారా? ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారా అని ఆలోచించదు. ఇనయా సుల్తానా నామినేషన్స్ లో మాట్లాడుతుంటే.. అయ్యో స్వామీ దేవూడా ఇంక చాలులే దొబ్బేయ్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఆ విషయాన్ని నాగార్జున మందలించాల్సింది పోయి.. నీకు నోటిదూల ఉంది కదా అని ప్రశ్నించి తప్పుకున్నాడు. అదేదో ఘనకార్యం అన్నట్లుగా నవ్వుకుంటూ మాట్లాడాడు. అంతా గీతూ రాయల్‌కి నాగార్జున ఎంత క్లాస్ పీకుతాడో అని ఎదురుచూశారు. కానీ, ఆ నవ్వు చూసి ఇంతకు మించి ఏం చేస్తారులే అంటూ లైట్ తీసుకున్నారు.
హౌస్‌లో అయితే గీతూ విషయంలో చాలా మంది నెగెటివ్‌గానే ఉన్నారు. శ్రీ సత్య లాంటి వాళ్లు గీతూ గురించి హాట్ కామెంట్స్ చేశారు. గీతూ ఎలా అయినా ఆడుతుంది. ఆమెకు రూల్స్ అవసరం లేదు. బిగ్ బాస్ కూడా ఆమెకే సపోర్ట్ చేసారుడ. నాగార్జున సార్ వచ్చి చప్పట్లు కొడతారు అంటూ శ్రీ సత్య కౌంటర్ వేసింది. గీతూ అయితే గత కొద్దిరోజులుగా మరీ రెచ్చిపోయి ఆడుతోంది, మాట్లాడుతోంది. ఆమె దురుసు తనానికి బ్రేకులు పడే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. గీతూ గేమ్ ప్లేపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె ఆటకు బిగ్ బాస్ మాత్రమే కాదు.. నాగార్జున కూడా భయపడుతున్నాడని చెబుతున్నారు. ఎందుకంటే అసలే రేటింగ్స్ లో బిగ్ బాస్ ఎక్కడో ఉందని చెబుతున్నారు.
ఇప్పుడు గీతూని మందలిస్తే ఆమె సైలెంట్ అయిపోతే ఈ మాత్రం ఆదరణ కూడా రాదని అభిప్రాయ పడుతున్నారు. అందుకే బిగ్ బాస్ కూడా గీతూ ఆట విషయంలో చూసీ చూడనట్లు వెళ్తున్నారని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో చంటిని గీతూ నోటికొచ్చినట్లు మాట్లాడింది. కెప్టెన్సీ టాస్కులో మీకు నచ్చని వాళ్లని తొలగించాలని కోరగా చంటి గీతూని తొలగించాలని కోరాడు. అందుకు గీతూ వచ్చి గేమ్ ఆడేది రానోళ్లు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను చెప్పింది తప్పా? అది పోకింగ్ కాదా అంటూ చంటి సీరియస్ అయ్యాడు. పోకింగ్ ఆపుకుంటే మంచిది అంటూ చెప్పగా ఎవడు ఏం చేయలేడంటూ గీతూ రాయల్ కామెంట్ చేసింది. దీన్ని బట్టి బిగ్ బాస్ మాత్రమే కాదు.. నాగార్జున కూడా ఆమె స్పీడుకు బ్రేకులు వేయలేరంటూ అభిప్రాయపడుతున్నారు.