చెన్నై- కాలేజీకి వెళ్లి, స్నేహితులతో కలిసి.. చక్కగా చదువుకుంటూ.. సంతోషంగా సాగాల్సిన విద్యార్థుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుని.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కొందరు విద్యార్థులు.. తోటి విద్యార్థిని చిత్ర హింసలకు గురి చేసి.. వీడియో తీసి రాక్షసానందం పొందారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న స్టేజ్ లో అతడిని వదిలేశారు. ఇక శత్రువులు పెట్టిన ప్రాణభిక్షతో తాను బతకలేనంటూ బాధిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు..
తమిళాడు రాణిపేట జిల్లా, అరక్కోణం సమీపంలోని గురువరాజుపేట గ్రామానికి చెందిన మణివన్నన్ కుమారుడు కుమార్(19). ఇతను చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. మంగళవారం కాలేజీ అయిపోయాక రైలులో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు కుమార్.
ఈ క్రమంలో తిరునిండ్రపూర్ సమీపంలో పచ్చప్ప కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు.. కుమార్ ను రైలు నుంచి కిందికు దింపి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అతడిని చితకబాది.. చిత్ర హింసలకు గురి చేసి.. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కుమార్ ని వదిలిపెట్టారు. అంతటితో ఆగక కుమార్ ను చిత్ర హింసలకు గురి చేసిన వీడియో, ఆడియోని రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చర్యలతో మనస్తాపానికి గురైన కుమార్.. శత్రువులు పెట్టిన ప్రాణ భిక్షతో బతకాల్సిన అవసరం తనకు లేదంటూ.. తల్లిదండ్రులకు మెసేజ్ చేసి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.