విక్రమార్కుడు- బేతాళుడు కథల గురించి అందరికీ తెలిసిందే. బేతాళుడిని తీసుకెళ్లేందుకు పట్టువదలకుండా విక్రమార్కుడు ప్రయత్నిస్తాడు. అలా నిజ జీవితంలో ఎవరైనా ఒక విషయంలో విజయం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే వారిని విక్రమార్కుడితో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అలాంటి ఒక పట్టువదలని ప్రభాకరన్ గురించి చెప్పబోతున్నాం. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా మీ ప్రయత్నాన్ని ఆపకూడదు అంటూ ఈ నవయుగ విక్రమార్కుడు చెబుతున్నాడు. మరి.. అతని కథ ఏంటి? ఆయన ఏం ప్రయత్నాలు చేసి విజయం సాధించాడో ఇప్పుడు తెలుసుకుందాం.
రత్న ప్రభాకరన్ ది తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని చిన్నకావనం. అతను 2016లో మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పట్టా పొందాడు. ఆ తర్వాత ఓపెన్ కేటగిరీలో ఎంబీఏ చేయడం ప్రారంభించాడు. మరోవైపు ఉద్యోగం కూడా వేట కూడా మొదలు పెట్టాడు. అలాగే పోటీ పరీక్షలు కూడా రాస్తూ ఉండేవాడు. అయితే రత్న ప్రభాకరన్ రాసిన ప్రతిసారి విఫలమయ్యాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 104సార్లు పోటీ పరీక్షల్లో విఫలమయ్యాడు. అయితే అతను ఎక్కడా మనో నిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రతిసారి తనలో ఉన్న లోపాలను సరిద్దిదుకోవడం ప్రారంభించాడు. అలా 105వ ప్రయత్నంలో ప్రభాకరన్ ఉద్యోగం సాధించాడు.
ఇటీవల రత్న ప్రభాకరన్ 105వ ప్రయత్నంలో ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. అందుకు సంబంధించిన ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఎప్పుడూ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు అంటూ తిరిగే రత్న ప్రభాకరన్ కు ఉద్యోంగ రావడంపై స్థానికులు, మిత్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో ప్రభాకరన్ కి చిరు సత్కారం కూడా చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. “నేను 69సార్లు బ్యాంకు, 39సార్లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాను. 104సార్లు విఫలమయ్యాను. బంధువులు, మిత్రులు అవహేళన చేసినా కూడా నా ప్రయత్నం ఆపలేదు. చివరికి విజయం సాధించాను” అంటూ ప్రభాకరన్ చెప్పుకొచ్చాడు. ప్రభాకరన్ కథ తెలుసుకుని చాలామంది స్ఫూర్తి పొందుతున్నారు.