దేశ రాజధాని ఢిల్లీ తుపాకీ చప్పులతో ఒక్కసారిగా ఉలిక్కి పండింది. రోహిణీ కోర్టులో కాల్పుల కలకలం.. అందరినీ కలవర పెట్టింది. సినీ ఫక్కీలో దుండగులు లాయర్ల వేషధారణలో వచ్చి గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపారు. అసలు ఏం జరుగుతోందో అని ఆలోచించేలోపే బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు. రోహిణీ కోర్టు రూమ్ నంబర్ 207లో గ్యాంగ్‌వార్ చూసి అందరూ ఉలిక్కి పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే జైలులో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని ఓ కేసులో విచారణ నిమిత్తం న్యాయస్థానికి తీసుకొచ్చారు పోలీసులు. అప్పటి వరకు బాగానే ఉంది న్యాయవాదుల వేషాల్లో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ గోగినే లక్ష్యంగా కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో జితేందర్ గోగి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు దుండగులు మరణించారు. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ గోగి సహా మొత్తం నలుగురు మృతి చెందారు. గోగి న్యాయవాదికి కూడా కాల్పుల్లో గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
భద్రతపై పలు అనుమానాలుఈ ఘటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై పలు అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు. ఢిల్లీలోని అన్ని కోర్టుల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎవరినీ తనిఖీ చేయకుండా లోపలికి పంపరు. ఆయుధాలను లోపలికి ఎలా తెచ్చారు. అంత అవకాశం ఎలా లభించింది అన్నదానిపై పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. రెండు గ్యాంగ్‌లకు సంబంధించిన వ్యక్తులు ఆయుధాలు ఎలా తేగలిగారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
