ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచంలో కొన్ని కట్టడాలు ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈజిఫ్ట్ పిరమిడ్స్, ఆగ్రా తాజ్ మహల్, హైదరాబాద్ చార్మినార్, చైనా గోడ.. ఇలా అరుదైన కట్టడాలు మనల్సి అబ్బురపరుస్తుంటాయి. ఏ మాత్రం టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ కట్టాడాలు ఎలా కట్టారో ఎవ్వరికి అంతుపట్టడం లేదు. ఇదిగో ఇలాంటి మరో కట్టడాన్ని యునెస్తే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంజినీర్లనే ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ కట్టడాలు చైనాలోని ఫ్యుజియన్‌లో ఉన్నాయి. వీటిని ఫ్యుజియన్ టులువ్ అని పిలుస్తారు.
ఆగ్నేయ చైనాలో ప్రాచీన కాలం నుంచే అపార్టుమెంట్లు ఉండేవి. అయితే ఇప్పటి అపార్టుమెంట్ల తరహాలో కాకుండా ఈ అపార్ట్ మెంట్లు గుండ్రంగా ఉంటాయి. ఇక ఈ కటట్డాలను సిమెంట్‌తో కాకుండా కేవలం మట్టి, చెక్కలతో నిర్మించారు. అక్కడ అడుగుపెట్టేవారికి అదో ప్రత్యేక ప్రపంచంలా కనిపిస్తుంది. సుమారు 12వ శతాబ్దంలో కట్టిన ఈ మట్టి అపార్టుమెంట్లు ఇప్పటికీ బలంగానే ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి. ఈ ప్రాంతంలో 12వ శతాబ్ద సమయంలో సాయుధ బందిపోట్లు ఎక్కువగా దాడులు చేసేవారట. గ్రామస్థులపై దాడులు చేసి దొరికనంతా దోచుకొనేవారు. దీంతో గ్రామస్థులందరినీ ఒకే చోట చేర్చి రక్షణ కల్పించే నిమిత్తం గుండ్రని అపార్టుమెంట్లు నిర్మించారు.
వీటిని టులువ్ అని పిలిచేవారు. ఈ అపార్ట్ మెంట్స్ లో ఉండే వారు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే అన్ని వస్తువులు అమ్మే దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అపార్ట్ మెంట్స్ కు రక్షణ కవచంగా ఉన్న తలుపులను పగలగొట్టడం చాలా కష్టం. ఒక్కో అపార్టుమెంటులో 3 నుంచి 5 అంతస్థులు ఉన్నాయి. దాదాపు 50 నుంచి 80 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ మట్టి అపార్టుమెంట్ల నిర్మాణానికి కేవలం మట్టి, కంకర మాత్రమే వాడారు. ఇనుప చువ్వలకు బందులు వెదురు బొంగులు వాడారు.
తలుపులు బలంగా ఉండటాని బయట వైపు మాత్రమే ఇనుము ఉపయోగించారు. ప్రస్తుతం ఫ్యుజిన్ వ్యాప్తంగా 20వేల టులులు ఉన్నాయట. ఇవి చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటాయి. భూకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయి. 1.8 మీటర్ల మందం గల ఈ మట్టి గోడల అపార్టుమెంట్లు అన్ని కాలాలను తట్టుకుని నిలుస్తున్నాయంటే అప్పటి నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గుండ్రంగా ఉండే భవనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మట్టి ఆపార్ట్ మెంట్స్ కు సంబందించిన వీడియో చూడండి మరి.