నియంత పరిపాలనలో ప్రజాస్వామ్యం అన్న పదానికి చోటు లేదు. అక్కడ రాజు లేదా ఒక డిక్టేటర్ ఉంటాడు. అతను చెప్పిందే శాసనం. శాసనాన్ని ఉల్లంఘిస్తే మరణ శాసనం విధిస్తాడు. అట్లుంటది నియంత దేశాలతోని. ఈ నియంతృత్వ పరిపాలన వల్ల అభివృద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి, అలానే అభివృద్ధి చెందని దేశాలు కూడా ఉన్నాయి. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ స్వేచ్ఛ అనేది లేకపోతే తిరుగుబాటు అనేది తప్పదు. స్వేచ్ఛగా తిరుగు బాట కోసం తిరుగుబాటు చేస్తారు. దీనికి చరిత్రలో జరిగిన అనేక ప్రజా పోరాటాలే నిదర్శనం. తాజాగా మయన్మార్ దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ దేశ సైనికులు తమ హక్కులను కాలరాయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు. అయితే అలా పోరాటాలు చేసిన వారిని ఉగ్రవాదులన్న నెపంతో శిక్షలు అమలు చేస్తోంది అక్కడి సైనిక ప్రభుత్వం.
మయన్మార్ సైనిక పాలకులు ఆ దేశ రాజకీయ నాయకులకు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్న నెపంతో వారికి ఉరి శిక్ష అమలుచేశారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితో పాటు మరో ముగ్గురు పాలకులకు మయన్మార్ సైనిక పాలకులు ఉరి శిక్షలు అమలు చేశారు. ఆంగ్ సాన్ సుకీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఫియో జెయాథావ్(41), హక్కుల కార్యకర్తలైన క్యావ్ మిన్ యు(53), హలా మియో ఆంగ్, ఆంగ్ థురా జావ్ ఉరికంబం ఎక్కారు.
వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ ప్రపంచదేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా శిక్షలు అమలు చేసినట్లు అధికార మిర్రర్ డైలీ వార్తా పత్రిక తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి చట్ట ప్రకారమే ఉరి శిక్షను అమలు చేసినట్లు వెల్లడించింది. అయితే శిక్షలను ఎప్పుడు అమలు చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. తన భర్తకు ఉరి శిక్ష అమలు చేసిన విషయం తనకు తెలియదని ఫియో జెయా థావ్ భార్య తెలిపింది. ఈ విషయమై అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె వెల్లడించింది.
ఈ పరిణామంపై సైనిక ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, చివరిసారిగా 1976లో సలాయ్ టిన్ మౌంగ్ వూ అనే విద్యార్థి నేతకు అప్పటి సైనిక ప్రభుత్వం ఉరి శిక్ష అమలు చేసింది. సైనిక పాలకులు ప్రజలను భయపెట్టేందుకే ఇలాంటి శిక్షలను అమలు చేస్తున్నారని మానవ హక్కుల నేతలు అంటున్నారు. మయన్మార్ సైనికుల తీరుపై ఆ దేశ సామాన్యులు రోడ్లెక్కి ‘సేవ్ మయన్మార్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా ప్రపంచదేశాలు నిలబడి, రాజకీయ నాయకులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చినా వినకుండా వారికి ఉరి శిక్ష అమలు చేసింది నియంతృత్వ సైనిక ప్రభుత్వం. దీంతో ప్రజాస్వామ్యాన్ని ఉరి తీశారని ప్రపంచ మీడియా తీవ్ర విమర్శలు చేస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.