పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అలా దూకితే ఇంకేమన్నా ఉందా? కిందకు పడిన మనిషి నుజ్జునుజ్జుకావడం ఖాయం. అయినా ఇలాంటి సాహసం చేసే వాళ్లు ఎవరైనా ఉంటారా అనుకుంటున్నారా? అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అతనే ప్రపంచంలో మోస్ట్ డేరింగ్ స్కైడైవర్ లూక్ ఐకిన్స్. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. కనీసం కలలో కూడా చేయడానికి భయపడే ఇలాంటి సాహసాన్ని చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడీ సాహస వీరుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు అతని సాహసానికి ఫిదా అవుతుంటే, మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. గతంలో కొన్ని వేల సార్లు విమానాల్లో నుంచి పారాచూట్ సాయంతో కిందకు దూకి స్కై డైవింగ్ కు వన్నె తెచ్చిన లూక్ ఐకిన్స్ , ఈ సారి ప్రమాదకరమైన సాహసానికి పూనుకున్నాడు.
ఎటువంటి పారాచూట్ లేకుండా 25 వేల అడుగులు ఎత్తు అంటే దాదాపు 7 కిలోమీటర్ల పై నుంచి కిందకు దూకేశాడు. ఇది అత్యంత ప్రాణాంతకమైన, భయంగొలిపే సాహసం. అయినా లూక్ ఐకిన్స్ ప్రాణాలకు తెగించి ఈ సాహసం చేశాడు. అంత ఎత్తులో విమానంలోంచి దూకి బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ సరాసరి కింద అమర్చిన వలలో పడ్డాడు. 400 అడుగుల ఎత్తులో 100 అడుగుల వెడల్పు, పొడవుతో వలను ఏర్పాటు చేశారు. లూక్ ఐకిన్స్ విమానం నుంచి నిర్ధేశించుకున్న విధంగా వలలో వచ్చి పడ్డాడు. ఏ మాత్రం అటు ఇటు అయినా అతని చావు వార్తను చదువుకోవాల్సిందే. 7 కిలోమీటర్ల ఎత్తునుంచి భూమి మీదకు చేరుకోవడానికి ల్యూక్ కు కేవలం 2 నిమిషాలు మాత్రమే పట్టింది. అంటే అతను పై నుంచి ఎంత వేగంగా కిందకు దూసుకొచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రాణాలను పణంగా పెట్టి, లూక్ చేసిన ఈ సాహసం ఇప్పుడు వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది.