కామారెడ్డి- చాలా సార్లు చూసే ఉంటాం.. నడి రోడ్డు మీద.. జనాల కళ్ల ఎదురుగానే దారుణాలు చోటు చేసుకుంటాయి. చాలా వరకు చూస్తూ ఉండేవారే తప్ప స్పందించే వారు చాలా తక్కువ. మిగతా సమయాలో మేం చాలా ధైర్యవంతులం అని చెప్పుకున్న వారు కూడా.. ఇలాంటి సందర్భాల్లో భయంతో బిగుసుకుపోతారు. కానీ కొందరు సాహసవంతులు మాత్రం స్పందించి.. బాధితులును ఆదుకుంటారు. ఈ తరహా సంఘటన ఒకటి కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కంట్లో కారం కొట్టి.. దొంగతనం చేయాలని భావించిన ఓ దొంగకి భారీ షాక్ తగిలింది. అతగాడి ప్లాన్ రివర్స్ అయ్యి.. చివరకు అతడి కంట్లోనే కారం కొట్టించుకునే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలోని ఓ కాలనీలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణం దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే దుకాణం తెరిచేందుకు మహిళా యజమాని షాపు వద్దకు చేరుకుంది. షాపు తీస్తుండగానే ఓ గుర్తుతెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని కిరాణం షాపు వద్దకు వచ్చాడు. తనకు చిప్స్ పాకెట్ కావాలని అడిగాడు.
దీంతో ఆ మహిళ చిప్స్ పాకెట్ తీసి ఇచ్చేలోగా జేబులో డబ్బులు తీస్తున్నట్టు గా నటించి అప్పిటికే తెచ్చుకున్న కారంపోడి పాకెట్ తీశాడు. తనవైపు డబ్బుల కోసం చూస్తున్న ఆ మహిళ కళ్లలో కారం చల్లాడు.. అనంతరం ఆ మహిళ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని, పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన.. ఆ మహిళ కేకలు వేసింది.అయితే సరిగ్గా ఆ సమయంలోనే కిరాణం షాపు వద్దకు స్థానికంగా ఉండే భారతి అనే మహిళ చేరుకుంది. జరుగుతున్న సంఘటనను కళ్లారా చూస్తూ ఊరుకులేదు.. వెంటనే తేరుకుని ఆ దొంగ కింద పడేసిన కారంపొడిని తీసుకుని పారిపోతున్న వాడి కళ్లలో కొట్టింది. అనంతరం దొంగ… దొంగ అంటూ కేకలు వేసింది. దీంతో అలర్ట్ అయిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు.
అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతనికి మతిస్థిమితం సరిగా లేక ఇలా చేశాడని చెబుతుండడం గమనార్హం. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.