ఇవాళ్టి రోజుల్లో అందరూ ఫోన్లకు బానిసలయ్యారు. గాడ్జెట్స్ అంటే పడి చస్తున్నారు. సాధారణ జీవితానికి సుదూరంగా బతుకున్నారు అని నీతివాక్యాలు చెప్తుంటారు. కానీ, ఈ వార్త విన్నాక మీ అభిప్రాయాలు మారిపోతాయి. అవును గాడ్జెట్స్‌తో స్నేహమే మంచిదేమో అనే భావన మీకు కూడా కలుగుతుంది. ఓ ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడింది ఓ స్మార్ట్ వాచ్. అటుగా వెళ్తున్న వారంతా చూస్తూ పట్టనట్లు వెళ్లిపోయారు. కనీసం అంబులెన్సుకు కూడా సమాచారం ఇవ్వలేదు.
సింగపూర్ అంగ్ మో కియో టౌన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన సెప్టెంబర్ 25న జరిగింది. మహముద్ ఫిట్రీ(24) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. అతను రక్తం మడుగులో కొట్టిమిట్టాడుతున్నాడు. అటుగా వెళ్తున్న వారు చోద్యం చూశారే తప్ప.. ఎవరూ పట్టించుకోలేదు. కనీసం అంబులెన్సుకు కూడా సమాచారం ఇవ్వలేదు. కచ్చితంగా అరగంట తర్వాత ఫిట్రీ స్మార్ట్ వాచ్ నుంచి ఎస్‌వోఎస్ సందేశం వెళ్లింది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రమాద స్థలానికి చేరుకుని అతడిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. సమయానికి చికిత్స అందించడంలో మహముద్ ఫిట్రీ ప్రాణాలను నిలిపింది.
ఫిట్రీ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్‌లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్లు, మెసేజ్‌లకు యూజర్ స్పందించకపోతే ఆ వ్యక్తి ఆపదలోఉన్నట్లు గుర్తిస్తుంది. ఎమర్జెన్సీ కాంటాక్టులకు సందేశం, కాల్ చేస్తుంది. ప్రమాదంలో ఏదైనా బలంగా ఢీకొడితే వాచ్ నుంచి వాల్ అలారమ్ మోగుతుంది. ఆ అలారమ్‌ను ఆఫ్ చేయకపోతే అప్పుడు యూజర్ ప్రమాదంలో ఉన్నట్లు గుర్తిస్తుంది. వెంటనే తన కాంటాక్టులో ఉన్న వారికి సమాచారం వెళ్తుంది. ఆ వాచ్‌ను మహముద్ ఫిట్రీకి తన ప్రేయసి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.