యూఏఈ లో ప్రధాన నగరమైన దుబాయ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పరిపాలనలో 100 శాతం పేపర్‌లెస్ గా మారి ప్రపంచంలోనే తొలి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల వ్యవహారాలను డిజిటల్ ఫార్మట్ లోనే కొనసాగిస్తోంది. వీటితో పాటు అంతర్గత, బాహ్య సేవలను, లావాదేవిలను వంద శాతం డిజిటల్ ఫార్మట్‌లోనే కొనసాగిస్తోంది. ఇలా పూర్తి స్థాయిలో పేపర్ లెస్ గవర్నెన్స్ గా మారి.. దుబాయ్ ఈ అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ “షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్” అధికార ప్రకటన విడుదల చేశారు.
దుబాయ్ చరిత్రలో కొత్త దశ ప్రారంభమైందని, ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం ఇది అని షేక్ హమ్దాన్ ఆ ప్రకటనలో తెలిపారు. పేపర్‌లెస్ గవర్నెన్స్ ద్వారా.. 14 మిలియన్ గంటల మనిషి శ్రమను, 1.3 బిలియన్ దిర్‌హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించడం వల్ల ప్రపంచానికే డిజిటల్ రాజధానిగా దుబాయ్ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దుబాయ్‌లో ఈ పేపర్‌లెస్ వ్యూహాన్ని ఐదు దశల్లో అమలు చేయడం జరుతోందని తెలిపారు.
ఇక దుబాయి విషయానికి వస్తే.. ప్రపంచంలోనే ధనిక నగరాల్లో ఒకటి. దుబాయ్‌లో జనాభా సంఖ్య సూమారు 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైగా ఉంది. ఎక్కువ శాతం జనాభా మెట్రో ప్రాంతంలో ఉండటం దుబాయికి కలిసి వచ్చింది. అందుకే పేపర్ లెస్ గవర్నెన్స్ ను తీసుకొచ్చిందని కొందరి అభిప్రాయం. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన దుబాయ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి.