పూర్వకాలంలో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్లేవారు. ఆ తరువాత చిన్న చిన్న వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. రైట్ సోదరులు విమానం కనుగొన్న తరువాత మానవ ప్రయాణంలో వేగం పెరిగింది. ఇప్పుడు భూమిమీద నుంచి స్పేస్‌లోకి ప్రయాణం చేస్తున్నారు. అయితే, ఒక దేశం నుంచి మరోక దేశానికి ప్రయాణం చేయాలంటే విమానంలోనూ దూరాన్ని బట్టి సమయం ఉంటున్నది. దీంతో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విధంగానే హైస్పీడ్ విమానాలను తీసుకురావాలని అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు ప్రయత్నిస్తున్నాయి. చాలా కాలంగా అదే ప్రయత్నంలో ఉన్నాయి.. అయితే, చైనా ఈ విషయంలో అందరికంటే ముందున్నట్టు ప్రకటించింది.
చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ హైస్పీడ్ విమానాన్ని తయారు చేసింది.ఈ సూపర్ సోనిక్ జెట్ విమానం గంటలో చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ నగరాన్ని చేరుకొనున్నట్లు తెలిపింది. ఇది గంటకు 2,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. ప్రస్తుత జెట్ విమానాల కంటే ఆరురెట్ల వేగంగా ప్రయాణం చేస్తుందని, టీయాంక్సింగ్ 1, టియాంక్సింగ్ 2 గా పిలిచే ఈ సూపర్ సోనిక్ విమానాలను చైనా సంస్థ ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించినట్టు తెలియజేసింది. 2024 నుంచి ఈ సూపర్‌సోనిక్ విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది.
ఇదే తొలి సూపర్ సోనిక్ విమానం కాదు
అయితే ఇదే మొదటి సూపర్ సోనిక్ విమానం మాత్రం కాదు. గతంలో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థలు సంయుక్తంగా కలిసి కాంకార్డ్ సూపర్ సోనిక్ వాణిజ్య విమానాన్ని 1973 సెప్టెంబరు 26న అందుబాటులోకి తీసుకొచ్చాయి. 1976 జనవరి 21న ప్రపంచంలోని మొట్టమొదటి షెడ్యూల్డ్ సూపర్ సోనిక్ విమానం ప్యాసింజర్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ జెట్లను బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్ విస్తృతంగా ఉపయోగించాయి. అయితే, విమానం శబ్దం ఎక్కువగా రావడం, నిర్వహణ వ్యయం కూడా భారీగా ఉండటంతో 2003 లో వీటి సేవలను నిలిపివేశారు.