ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు ఇండియాలో రోజురోజుకి పెరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పేరు కలిగిన సెలబ్రిటీలు బాధ్యతగా ప్రభుత్వం విధించిన ప్రోటోకాల్ పాటిస్తూ జనాలకు స్ఫూర్తినివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ సీనియర్ స్టార్ హీరో తాజాగా గవర్నమెంట్ విధించిన ప్రోటోకాల్ బ్రేక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ స్థార్ హీరో ఎవరో కాదు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.
ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పటిష్టమైన ప్రోటోకాల్ అమలు చేస్తూ హెచ్చరిస్తున్నాయి. ఇటీవల అమెరికా నుండి ఇండియాకి తిరిగొచ్చిన కమల్ హాసన్ స్వల్పంగా అనారోగ్యానికి గురవడంతో కరోనా పాసిటివ్ వచ్చింది. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సలహా మేరకు క్వారెంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. అయితే డిశ్చార్జ్ అయిన వెంటనే కమల్ హాసన్ బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో తమిళనాడు ప్రభుత్వం ఆయనపై మండిపడింది.
డిశ్చార్జ్ అయ్యాక కొద్దిరోజులు హోమ్ క్వారెంటైన్ లో ఉండకుండా ఇలా షోలకు వెళ్తే షోలో ఉండేవారికి ప్రమాదమని తెలిపింది. సొసైటీలో ఇంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన మీలాంటి వారే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా? అంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ విషయం పై వివరణ కోరుతూ రాష్ట్రప్రభుత్వం కమల్ హాసన్ కు నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కమల్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నాడు.