‘సార్.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి.. నా సెల్ లో బ్యాలన్సు అయిపోయింది.. ఒకసారి ఫోన్ ఇస్తారా!’ ఇలాంటి ఘటనలు అందరూ పేజ్ చేసే ఉంటారు. ఏదేని సందర్భాల్లో అపరిచిత వ్యక్తులు ఫోన్ అడగడం.. పాపమని మనం ఇవ్వడం.. లేదయ్యా అని మనం అన్నామనుకో.. అవతలి వ్యక్తి, ‘సార్ ప్లీజ్.. ఒక్క కాల్.. మా ఇంట్లో వాళ్లకు బాగోలేదు లేదంటే నా పర్స్ పోయింది’ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారి మాటలు అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇదో కొత్త రకం స్కామ్. పోనీ, అని ఫోన్ ఇచ్చామా అతడు అక్కడినుంచి పక్కకువెళ్లిన మరుక్షణం.. మీ ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
మోసం చేయాలనే ఆలోచన ఉండాలే కానీ, మోసపోయేవారు తక్కువా చెప్పండి. ‘మంచికి పోతే చెడు ఎదురైంది’ అనే నానుడి గురించి వినే వుంటారు. ఈ విషయం చాలామంది విషయంలో జరిగే ఉంటుంది. అయినా పాపమని మనం సానుభూతి చూపుతునే ఉంటాం.. మోసపోతూనే ఉంటాం.. అందుకే ఈ కాలంలో ఎదుటివారిని నమ్మడానికి వీల్లేదు. ఇలాంటి విషయాలలో కాస్త ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. నేరగాళ్లు ‘కాల్ స్కామ్’ అనే కొత్త టెక్నీక్ తో అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ స్కామ్ గురించి కొన్ని తెలుసుకుంటే కాస్తయినా జాగ్రత్తగా పడవచ్చు.
ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని స్కామర్లు ఈ కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. మొదట చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి అని మీ ఫోన్ అడుగుతారు. ఇవ్వగానే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ లు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి. అందులో బ్యాంకు ట్రాన్సక్షన్స్ కు సంబంధించిన OTP వంటి వివరాలు కూడా ఉండొచ్చు. ఇవి కనుక స్కామర్ల కళ్లకు చిక్కితే.. క్షణాల్లో మీ అకౌంట్ ఖాళీ అవుతుంది.
మీరు ముందుగా మీ ఫోన్ కాల్స్ వేరేవారికి ఫార్వర్డ్ చేయబడుతున్నాయా లేదా అన్నది కనిపెట్టాలి.అందుకోసం.. మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే దాన్ని తొలగించాలి. అందుకోసం.. మీ ఫోన్ Settingsలో Call > Call Forwarding లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ నుTurn Off చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ కాల్ స్కామ్ నుంచి జాగ్రత్తగా పడవచ్చు. ఈ విషయం.. మీకు ఉపయోగపడినట్లేనా.. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.