హైదరాబాద్- ఇప్పటి వరకు మనం బైక్ స్టంట్స్ మాత్రమే చూశాం. అప్పుడప్పుడు యువకులు రోడ్డుపై బైక్ తో సరదాగా స్టంట్స్ చేస్తుండటం మన కంట పడుతూనే ఉంటుంది. ఐతే ఇలా స్టంట్స్ చేయడం ప్రమాదకరం. రోడ్డుపై స్టంట్స్ చేయడం ప్రమాదకరమని, నేరమని పోలీసులు సైతం చెబుతుంటారు.
బైక్ స్టంట్సే ప్రమాదకరమంటే.. ఇక ఆటోతో స్టంట్స్ అంటే ఇంకేత ప్రమాదకరమో. హైదరాబాద్ లో కొంత మంది అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ చేసి తోటి వాహనదారులను హడలెత్తించారు.పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అందరిని భయాందోళనకు గురిచేస్తూ, తోటి వాహనాలు, లారీని ఓవర్ టేక్ చేస్తూ.. భయంకరంగా వ్యవహరించిన ఆరుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ అలీ(20), సయ్యద్ సాహిల్(21), మహ్మద్ ఇబ్రహీం(22), మహ్మద్ ఇనాయత్(23), గులాం సైఫ్‌ద్దీన్(23), మహ్మద్ సమీర్(19), అమీర్ ఖాన్(20) అద్దెకు ఆటోలను తీసుకుని నడుపుతుంటారు. గురువారం అర్ధరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. రాత్రి 12.30 గంటలకు చాంద్రాయణగుట్ట నుంచి బాబానగర్ మీదుగా డీఆర్‌డీఎల్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని తిరిగి బాబానగర్ వైపు వెళ్లారు.
మామూలుగా వెళ్తే సమస్యే ఉండేది కాదు, ఆటోలను భయంకరమైన రీతిలో రెండు టైర్లపై క్రాస్ గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు వణుకుపుట్టించారు. దీంతో ట్రాఫిక్ కు కూడా అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ఆటోలతో చేసిన స్టంట్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రెండు ఆటోలను స్వాదీనం చేసుకున్నారు.
Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ
— Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022