తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడు అజిత్. మొదట తెలుగు ఇండస్ట్రీలో ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అజిత్ నటుడిగానే కాకుండా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అంటారు. అభిమానుల విషయంలో ఆయన సహృదయంతో ఉంటారని ఫిలిమ్ వర్గాల్లో టాక్. అలాంటి నటుడు అజిత్ వల్ల తన ఉద్యోగం పోయిందని ఓ మహిళ ఆయన ఇంటి ముందు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. అజిత్ ఇల్లు ఈజంబాక్కంలో ఉంది. ఆయన ఇంటి ముందు ఓ మహిళ చాలా సేపు గొడవ చేసింది.. అక్కడకు చేరుకున్న పోలీసులు విచారిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతియత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం.. అజిత్ కుమార్, అతడి భార్య షాలిని గతేడాది తేనంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఫర్జానా అనే ఉద్యోగిని అజిత్ ని ఫోటోలు తీయడం అతనితో సెల్ఫీ తీసుకొని వాటిని సోషల్ మాద్యమంలో షేర్ చేయడం జరిగింది. దాంతో తమ అభిమాన నటుడుకి కరోనా వచ్చిందని పుకార్లు పుట్టుకు వచ్చాయి. దీనిపై ఆగ్రహించిన ఆసుపత్రి యాజమాన్యం ఆమెను విధుల నుంచి తప్పించింది.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె అజిత్‌ను కలిసి మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి ఇస్తారని ఆశతో ఫర్జానా పలుమార్లు అజిత్ ని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మరో మహిళతో అజిత్ ఇంటి ముందుకు వచ్చి ఒక్కసారిగా కేకలేస్తూ, తన ఉద్యోగం పోవడానికి అజితే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం ఇంటికి పంపారు. మహిళపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.