తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ‘కార్తీక దీపం’ సీరియల్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ గత ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇక కార్తీక దీపం సీరియల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బాబు (నిరుపమ్), వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). తెలుగు బుల్లితెరపై నిరుపమ్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. ఇక ప్రేమీ విశ్వనాథ్ మాలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
కార్తీక దీపం సీరియల్ ఆరేళ్లు కొనసాగినప్పటికీ.. డాక్టర్ బాబు అదేనండీ నిరుపమ్ ఏనాడు కూడా ప్రేమి విశ్వనాథ్ ని తన ఇంటికి ఇన్వేట్ చేయలేదని పలు సందర్భాల్లో ఆమె కామెంట్స్ చేసింది. మొత్తానికి నిరుపం ఆయన భార్య మంజుల తమ ఇంటికి ప్రేమి విశ్వనాథ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరుపం సతీమణి మంజుల మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి తాము ప్రేమి విశ్వనాథ్ ని తమ ఇంటికి ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ ఈనాటికి కుదిరిందని అన్నారు. ఈ సందర్భంగా నిరుపమ్, మంజులతో ప్రేమీ సరదాగా ముచ్చటించింది. ప్రేమి విశ్వనాథ కి తన ఇల్లంతా తిప్పి చూపించాడు నిరుపమ్.
ఈ సందర్భంగా వంటలక్కను చూసిన నిరుపమ్ తల్లి ఎంతో సంతోషించారు.. తనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ తర్వాత తన కుమారుడు రిక్కీ వేసిన పెయింటింగ్స్ చూపించింది మంజుల. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ బాయ్ తెచ్చే వంటలకు వంటలక్క రక రకాల పేర్లు పెట్టి ఏడిపించేదని.. బాగా వంట చేసేవాళ్లు కూడా ఈ రకంగా పేర్లు పెట్టరని ఫన్నీగా ఆటపట్టించాడు. దానికి వంటలక్క సమాధానం చెబుతూ.. బాగాలేకుంటే లేదని చెప్పాలి.. మా ఇంట్లో నేనే వంట చేస్తానని అంది. అయితే ఈ రోజు మా ఇంట్లో నువు సాంబారు పెట్టాలి అన్నాడు నిరుపమ్.. అంటే ఇందుకేనా నన్ను మీ ఇంటికి పిలిచావు.. మీ వంట మనిషి రాలేదా? అంటూ కౌంటర్ వేసింది.
నిరుపమ్ దంపతులు ప్రేమి విశ్వనాథ్ కి సాంప్రదాయం ప్రకారం చీరాసారే పెట్టారు. ఈ వీడియోలో నిరుపమ్ కుటుంబ సభ్యులతో చాలా సందడి చేసింది ప్రేమి విశ్వనాథ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక సీరియల్ విషయానికి వస్తే కార్తీక దీపంలో డాక్టర్ బాబు, వంటలక్క భార్యాభర్తలుగా ఉన్నటప్పటికీ ఏనాడు కలిసి జీవించరు.. ఎప్పుడూ ఏదో ఒక ట్విస్ట్ తో ఇద్దరూ విడిపోతూ ఉంటారు. మొత్తానికి ఈ సీరియల్ తో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరికీ సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి.. అందులో వీడియోలు చేస్తూ అప్ లోడ్ చేస్తుంటారు. తాజాగా డాక్టర్ బాబు ఇంటికి వంటలక్క ప్రత్యేక అతిధిగా వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.