ఈ మధ్య కుర్రాళ్లని ఎవరిని కదిపినా సరే.. ‘రోలెక్స్ సర్, యస్ సర్’ అని హడావుడి చేస్తున్నారు. ఇన్ స్టా రీల్స్ లో రోలెక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియోస్ చేస్తున్నారు. ‘విక్రమ్’ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ దాదాపు అందరూ మర్చిపోయారు.. ఒక్క రోలెక్స్ పాత్ర తప్ప. ఎందుకంటే సూర్య కళ్లలో ఓ రకమైన క్రూయల్టీ, నవ్వుతూనే భయపెట్టడం.. ఇలా ఉన్న ఐదు నిమిషాల్లో మాస్ సినిమాకు కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చాడు. ఇక ఈ సినిమా కమల్ కి గ్రాండ్ హిట్ ఇవ్వడమే కాదు.. తమిళ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు రోలెక్స్ రోల్ గురించి ఆసక్తికర విషయాల్ని సూర్య బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముందుతరం వాళ్లకు కమల్ హాసన్ ఎంత పెద్ద హీరోనో.. ప్రెజంట్ జనరేషన్ వాళ్లకు సూర్య అలా. నటన విషయంలో ఎవరినీ వంకపెట్టలేం. అలాంటి ఈ ఇద్దరూ కలిసి నటిస్తే.. థియేటర్ల పూనకాలు పక్కా. ఇక ఈ బాధ్యతని భుజానేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్ర కోసం ఫస్ట్ సూర్యని సంప్రదించాడు. సూర్యకి ఏమో ఆ రోల్ చేయాలంటే భయంగా అనిపించింది. కానీ అదే సమయంలో కమల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ మొత్తం విషయాన్ని స్వయంగా సూర్య.. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో బయటపెట్టాడు.
‘ఈరోజు నేను ఏం చేసినా, జీవితంలో ఈ స్థాయిలో ఉండటానికి కమల్ హాసన్ సర్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పినప్పుడు వదులుకోదల్చుకోలేదు. భయపెట్టిన పనిని చేస్తే మనకు ఎదుగుదల అని నమ్ముతాను. అందుకే తొలుత రోలెక్స్ పాత్ర చేయనని లోకేశ్ కి చెప్పడానికి రెడీ అయ్యాను. లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకుని ఓకే చెప్పేశాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే లోకనాయకుడు కమల్ హాసన్’ అని సూర్య చెప్పాడు. ఇదిలా ఉండగా కమల్, సూర్య, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది. ఇక లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘ఖైదీ 2’లో కార్తీ హీరోగా, సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఆ తర్వాత ‘విక్రమ్ 3’లో కార్తీ, కమల్ హాసన్ కి సూర్య విలన్ గా కనిపిస్తాడు. మరి సూర్య రోలెక్స్ పాత్రపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.