బాలీవుడ్ తారలను టాలీవుడ్ కి తీసుకొచ్చి స్టార్స్ చేయడం అనేది తెలుగువాళ్లకు కొత్తేమి కాదు. గతంలో తప్ప.. ఒక 20 ఏళ్లుగా తెలుగులో స్టార్డమ్ అందుకుంటున్న హీరోయిన్స్ అందరూ వేరే స్టేట్స్ నుండి వచ్చినవారే. తెలుగు సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలకు అంత డిమాండ్ ఉందన్నమాట. మామూలుగా అయితే బాలీవుడ్ హీరోయిన్లను తెలుగు సినిమాలలో లీడ్ రోల్స్ చేయడం చూశాం. కానీ.. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పీరెన్సు వరకే పరిమితమైన బ్యూటీలను కూడా తెలుగులో హీరోయిన్స్ గా పరిచయం చేస్తుండటం గమనార్హం. ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాతో సన్నీ లియోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తెలుగు భాష రాదు. సో.. సన్నీ లియోన్ గ్లామర్ ని బేస్ చేసుకొని ఇంతకాలం ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పీయరెన్సు వరకు పరిమితం చేశారు. కానీ.. మంచు విష్ణు ఒక్కడే సన్నీకి హీరోయిన్ గా జిన్నాలో ఫుల్ లెంత్ రోల్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సన్నీ లియోన్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది మంచు మనోజ్. అలా కరెంట్ తీగ మూవీతో మనోజ్ పరిచయం చేస్తే.. జిన్నాతో సన్నీని ప్రేక్షకులను మరింత దగ్గర చేశాడు విష్ణు. ఇదిలా ఉండగా.. జిన్నా మూవీ ప్రమోషన్స్ పెద్దగా కనిపించని సన్నీ.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
జిన్నా కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పింది సన్నీ. తెలుగు భాష రాని సన్నీ జిన్నా గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చెవిటి, మూగ అమ్మాయి పాత్ర. తెరపై లోపాలు కనిపించకూడదని యాక్టింగ్ కోచ్ ని పెట్టుకొని సైన్(సైగ) లాంగ్వేజ్ నేర్చుకున్నాను. మూవీ షూట్ స్టార్ట్ అవ్వకముందే యాక్టింగ్ కోచ్ ద్వారా కొన్ని వారాలపాటు సైన్ లాంగ్వేజ్ శిక్షణ పొందాను. నేను, నా కోచ్ ఇద్దరం సినిమాలో నా క్యారెక్టరైజేషన్, స్టోరీ గురించి చర్చించాం. డైరెక్టర్, రైటర్ లతో మాట్లాడి కథను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అయితే.. అర్థం చేసుకున్న విషయాన్ని బిగ్ స్క్రీన్ పై ప్రెసెంట్ చేయడమే అసలు ఛాలెంజ్.
జిన్నాలో రేణుక పాత్ర కోసం నాతో పాటు నా కోచ్ చాలా హెల్ప్ చేశారు. సైన్ లాంగ్వేజ్ కి సంబంధించి కొన్ని పుస్తకాలు, వీడియోలు నాకు ఇచ్చారు. ఇక నా క్యారెక్టర్ ని అంత బాగా డిజైన్ చేసినందుకు కోన వెంకట్ కి థ్యాంక్స్ చెప్పాలి’’ అని సన్నీ చెప్పుకొచ్చింది. అలాగే షూటింగ్ లొకేషన్ లో ప్రతి సీన్ కి ముందు ఒక గంటపాటు రిహార్సిల్ చేశానని సన్నీ చెప్పింది. ఇక జిన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు. కానీ.. మంచు విష్ణు చేసిన గత సినిమాలతో పోల్చితే ఇది బెటర్ అనిపించుకుంది. చూడాలి మరి మంచు విష్ణు జిన్నా-2 మూవీని పట్టాలెక్కిస్తారో లేదో!