దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతి వేడుకలు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన “దాసరి ఫిల్మ్ అవార్డ్స్” వేడుకలో పలు సినీ కార్మిక విభాగాల ప్రతినిధులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ & వాసవి ఫిలిం అవార్డ్స్ సంస్థలతో కలిసి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు, దర్శకుడు రావిపల్లి రాంబాబు సభా ప్రయోక్తగా వ్యవహరించిన ఈ సభకు హీరో సుమన్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, అవార్డ్స్ కమిటీ చైర్మన్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, నిర్మాతలు సి. కల్యాణ్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్, అచ్చిరెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, రచయిత రాజేంద్ర కుమార్ తదితరులు అతిథులుగా అవార్డు గ్రహీతలకు సత్కారాలు అందించారు.
ఇక నిర్మాతలు జి.ఆదిశేషగిరిరావు, చలసాని అశ్వనీదత్, అంబికా కృష్ణ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, డిస్ట్రిబ్యూటర్స్ గ్రంధి విశ్వనాధ్, వివి బాలకృష్ణమూర్తి, రచయిత సత్యానంద్, వంశీ రామరాజు “దాసరి జీవన సాఫల్య పురస్కారం” అందుకోగా.. ఇయ్యపు రామలింగేశ్వరరావు, బొబ్బిలి బంగారయ్య, చిట్టి వెంకట్రావు, గట్టు బాలకృష్ణమూర్తి, కాదంబరి కిరణ్ “దాసరి స్మారక పురస్కారం” అందుకున్నారు. వీరితో పాటు.. డిజిటిల్ మీడియాలో చేస్తున్న కృషితో, సమాజానికి చేస్తున్న సేవకి గాను.. సుమన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ గారు.. దాసరి స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు.
సుమన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ తరుపున ఈ పురస్కారాన్ని అందుకున్న సుమన్ టీవీ సినిమా చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. “నేనిప్పుడు ఈ అవార్డు సుమన్ టీవీ తరపున తీసుకున్నాను. నేను సుమన్ టీవీలో సినిమా చీఫ్ ఎడిటర్. అయితే.. సుమన్ గారు కేవలం ఆరు సంవత్సరాల క్రితం సుమన్ టీవీని ప్రారంభించి, ఈ రోజు సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ డిజిటల్ నెట్ వర్క్ గా దీనిని విసృతపరిచి, ఎన్నెన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రోజు వందమందికి పైగా భోజనాలు అందిస్తున్నారు. కరోనాకు ముందు, ఆ తర్వాత కూడా భోజనాలు అందిస్తున్నారు. బయటవారితో పాటు ఆఫీస్ లోని ఉద్యోగులకు కూడా భోజన సదుపాయం కల్పించారు. కరోనా సమయంలో సుమన్ గారు చేసిన సేవా కార్యక్రమాలకు అంతుపంతు లేదు. ఆయన చేతికి ఎముక లేదు. అంత గొప్ప వితరణశీలతను ప్రదర్శించినటువంటి సుమన్ గారికి ఈరోజు సేవా పురస్కారం అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంస్థలో నేను ఓ ఉద్యోగిని అయినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను” అని తెలిపారు.