ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రేమకథా చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. లవ్ స్టోరీస్ లో కూడా ప్రేక్షకుల గుండెను పిండేసి ఏడిపించే సినిమాలు ఇంకా అరుదు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్తుంటారు. ఇటీవల ‘సీతారామం‘ మూవీ విషయంలో అదే జరిగింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అలాగే చాలాకాలం తర్వాత అటు దర్శకుడికి, ఇండస్ట్రీకి సూపర్ హిట్ లభించిందని చెప్పాలి.
ఇక క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సీతారామం మూవీ.. కలెక్షన్స్ పరంగా డబుల్ ప్రాఫిట్ రాబట్టింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో ఒకేసారి ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా.. సెప్టెంబర్ 2న హిందీలో రిలీజ్ అయ్యింది. అయితే.. మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సీతారామం.. బాక్సాఫీస్ బరిలో రూ. 17 కోట్ల టార్గెట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక రిలీజైన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి.. అటు ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలను వెనకేసుకుంది. అలాగే సినిమాలలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరించడానికి సిద్ధంగా ఉంటారని నిరూపించింది సీతారామం.
ఎపిక్ లవ్ స్టోరీగా రికార్డు సృష్టించిన సీతారామం మూవీ.. సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు హిందీ వెర్షన్ థియేటర్స్ లో రన్ అవుతుండటం విశేషం. మరి థియేట్రికల్ రన్ లో సీతారామం వరల్డ్ వైడ్ గ్రాస్, షేర్ ఎంత కలెక్ట్ చేసింది? ఎన్ని కోట్లు ప్రాఫిట్ అందుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీతారామం వరల్డ్ వైడ్ రూ. 40 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్, రూ. 90 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో చూసినట్లయితే.. 2.05 మిలియన్ డాలర్స్ గ్రాస్, ముఖ్యంగా నార్త్ అమెరికాలో 1.55 మిలియన్ డాలర్స్ వచ్చాయని చెబుతున్నారు. మొత్తంగా సీతారామం బ్రేక్ ఈవెన్ పక్కన పెడితే.. రూ. 23 కోట్లు లాభాలను తెచ్చిపెట్టినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. సీతారామం మూవీ ప్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ హను రాఘవపూడికి, తెలుగులో దుల్కర్ సల్మాన్ కి, అలాగే వైజయంతి బ్యానర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అదీగాక దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే సీతారామం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు దుల్కర్ సినిమాలేవీ కూడా 90కోట్ల మార్క్ ని అందుకోలేకపోయాయి. చివరిగా కురుప్ మూవీ 85 కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి తెలుగులో బెస్ట్ డెబ్యూ లభించింది. సీత క్యారెక్టర్ లో అందరి మనసులు గెలుచుకుంది. మరి డబుల్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించిన సీతారామం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.