సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. గాయనిగానే కాక.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు సునీత. కొన్ని ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు సింగర్ సునీత. ఇక ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కుమార్తె సింగర్‌గా రాణించే ప్రయత్నంలో ఉండగా.. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఆ వివరాలు..
సింగర్ సునీత కుమారుడు ఆకాశ్.. సర్కారు నౌకరి చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం.. పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడిగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈమెకు హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. ఇక ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విదేశాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆకాశ్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకుగాను.. ఏడాది నుంచే ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. ఏడాది కాలంగా ఆయన యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆకాశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్స్‌ను చూపిస్తున్నాడు. తన సింగింగ్, డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఇక త్వరలోనే వెండితెరపై తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపించబోతున్నాడు. చాలా ఏళ్లుగా తన ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా జీవించిన సునీత.. పిల్లల కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లాడారు. మరి తల్లిలానే ఆకాశ్ కూడా సినిమాల్లో రాణిస్తాడా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.