సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరు నటిస్తున్నారో.. ఎవరు మన వారో తెలుసుకోవడం చాలా కష్టం. మనం ఏమాత్రం అమాయకంగా కనిపించినా.. ఇక అవతలి వాళ్లు.. మన జీవితాలతో ఆడుకుంటారు. నిండా ముంచుతారు. పూర్తిగా మోసపోయి.. ఆస్తులన్ని పొగొట్టుకుని రోడ్డున పడ్డాక తెలియదు మనం మోసపోయామని. అయితే ఇండస్ట్రీలో ఈ జనరేషన్ వాళ్లు.. కాస్త తెలివిగానే వ్యవహరిస్తున్నారు. కానీ పాత తరం నటీనటుల్లో చాలా మంది ఇలా ఇతరులను నమ్మి దారుణంగా మోసపోయారు. వారిలో మనకు ఎక్కువగా వినిపించేది.. నటి సావిత్రి పేరు. మనవాళ్లు అని నమ్మి.. వారి చేతుల్లో మోసి పోయి.. ఆస్తులన్ని పోగొట్టుకున్నారు సావిత్రి. మరో సీనియర్ నటి కూడా ఇలానే చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసి.. ఆస్తులు పోగొట్టుకున్నారు. బతకడం కోసం ఇప్పుడు మళ్లీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఆ వివరాలు..
సీనియర్ నటి పీఆర్ వరలక్ష్మి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదమో కానీ.. 30-40 ఏళ్ల క్రితం వరకు ఆమె వెండి తెరపై వెలిగిపోయింది. కమల్ హాసన్, జెమిని గణేషన్, ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది వరలక్ష్మి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు 800కు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె పలు తమిళ సీరియల్స్ నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీ.. పీఆర్ వరలక్ష్మిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో చోటు చేసుకున్న అనేక సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
‘‘నాకు సాయం చేసే అలవాటు ఉండేది. అది ఎంత ఎక్కువగా ఉండేది అంటే.. రోజూ ఎవరికో ఒకరికి ఎంతో కొంత దానం చేయకపోతే.. నాకు నిద్ర పట్టేది కాదు. అలా అందరికి సాయం చేసుకుంటూ పోవడం వల్ల.. రాను రాను నా ఆస్తి తరిగిపోయింది. ఆ తర్వాత సినిమాల కోసం ఇల్లు అమ్మునుకున్నాను.. కోట్లు ఖర్చు చేశాను. అలా మరి కొంత ఆస్తి పోయింది. ఇప్పుడు నా ఖర్చులు తీర్చుకోవడం కోసం సంపాదించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర వందల కోట్ల ఆస్తులు లేవు’’ అని చెప్పుకొచ్చారు.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘నాది లవ్ మ్యారేజ్. ఏడేళ్లు ప్రేమించి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. కానీ మా ప్రేమను అంగీకరించకపోతే.. ఇంటి నుంచి పారిపోయి మరీ వివాహం చేసుకున్నాం. నా భర్త చాలా మంచి వాడు. బాగా చదివేవాడు. గోల్డ్ మెడలిస్ట్. అయితే ఆ మా మధ్య ఏదైన గొడవ జరిగితే.. ఏడాది దాకా మాట్లాడేవాడు కాదు. అలా ఓ సారి మా ఇద్దరి మధ్య ఇల్లు అమ్మకం విషయంలో గొడవ జరిగింది. అది కాస్త పెరిగి పెద్దదిగా మారడంతో.. మా మధ్య దూరం కూడా అలానే పెరిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.
‘‘ఆ గొడవ కారణంగా.. మా ఆయన నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. 30 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా నాతో టచ్‌లోకి రాలేదు. ఆయన బతికున్నాడో లేడో కూడా నాకు తెలియదు. అయినా తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తే సరే.. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో అని మేము వెతుక్కుంటూ వెళ్లకూడదు అనుకున్నాను. కానీ చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషికి దూరమయ్యానే అని బాధపడుతుంటాను’’ అన్నారు పీఆర్ వరలక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.