విడుదలకు ముందే వివాదాలతో సహవాసం చేసిన భీమ్లానాయక్ సినిమా విడుదల తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టించింది. కానీ.. తాజాగా ఒక కొత్త వివాదం ఆ సినిమాకు చుట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
కాగా ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధప్రదేశ్ లోని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.పురుషోత్తం మండిపడ్డారు. ఒక సన్నివేశం చిత్రం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు పురుషోత్తం ఫిర్యాదు కూడా చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ , రానా మధ్య ఓ ఫైట్ సీన్లో కుమ్మరి చక్రాన్ని రానా కాలితో తన్ని… దానిని తీసుకుని పవన్ పై దాడి చేసినట్లు చూపించారు.
అయితే తాము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని.. దానిని కాలితో తన్నినట్లు చూపించడం తమను కించపరచమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా ఉందని పురుషోత్తం పేర్కొన్నారు. ఆ సన్నివేశం సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోలేని తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. అలాగే సినిమాలో నటించిన పవన్, రానా, దర్శకుడు సాగర్, నిర్మాత చినబాబు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విడుదల సమయంలో ఏపీలో సినిమా టికెట్ల విషయంలో వివాదాలు ఎదుర్కొన్న భీమ్లానాయక్‌కు ఈ వివాదం కొత్త తలనొప్పిగా మారింది. మరి పురుషోత్తం ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.