హీరో నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఏం జరిగింది.. ఈ సినిమాపై వివాదానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తోన్న NC 22 మూవీ షూటింగ్ కర్ణాటక, మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుంది. సినిమాలో భాగంగా అక్కడ సెట్ వేసి.. షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇలా షూటింగ్ చేయటంపై అక్కడున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నాగ చైతన్య సినిమా యూనిట్ సెట్ వేసి.. షూటింగ్ చేస్తోన్న ప్రాంతం పక్కనే రాయ గోపుర దేవాలయం ఉంది. అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. అలాంటి పవిత్ర దేవాలయం ముందు బార్ సెటప్ వేసి.. ఇలా డాన్సులు చేస్తూ అపవిత్రం చేయడమేంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే.. చిత్ర యూనిట్‌పై గ్రామస్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
నిత్యం పూజలు జరిగే గుడి ముందు ఇలా బార్ సెట్ చేసి.. పిచ్చి గెంతులు వేయటం.. హిందు దేవుళ్లను అవమానించటమేనని భావించిన గ్రామస్తులు సెట్‌ను ధ్వంసం చేశారని వార్తలు వస్తోన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.