“ముదితల్ నేర్వగరాని విద్యల్ కలవే ముద్దార నేర్పించినన్…”అన్న నోటితోనే “న స్త్రీ స్వతంత్ర మర్హతి.. ” అని కూడా అంటారు . స్త్రీ స్వేచ్ఛ- స్త్రీ నిర్బంధం అనే రెండు వైరుధ్య భావాల నడుమ మసలుతూ, మరుగుతూ, కరుగుతూ, పెరుగుతున్నారు మన మహిళలు. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉనికిని చాటుకునే క్రమంలో చాలా రకాల ఒత్తిళ్ళకు, ఉద్వేగాలకు లోనవుతుంటారు మన ఆడవాళ్ళు. ఎన్ని అవమానాలు, అనుమానాలు, ఛీత్కారాలు, అపజయాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ విజయ బావుటా ఎగురవేస్తున్నారు కొందరు మహిళా మణులు. నిజానికి ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ విజయం పురుష పుంగవులకే కాదు కొందరు స్త్రీలకు కూడా మింగుడుపడదు. అయినా.. సాధించిన విజయాలు కళ్ళముందు కనిపిస్తుంటే ఔననక ఛస్తారా…? కాదని ఎదిరించగలరా..? అలా కాదన్న వారితోనే ‘అవును ‘… అనిపించుకొని, అవమానం పొందిన చోటే అందలాలు ఎక్కి.. వెక్కిరించిన వాళ్లకు చుక్కలు చూపించిన ఉమెన్ ఎచీవర్స్ కొంతమంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వారిలో ప్రముఖంగా వినిపిస్తున్నపేరు “రోజా”.
యస్…రోజా…!తెలుగు తెరమీద అగ్ర కథానాయికగా, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘రోజా ‘ అవిశ్రాంత ప్రస్థానంపై సుమన్ టీవీ అందిస్తున్న అభినందన పూర్వక ప్రత్యేక కథనం ఇది.
రోజా అసలు పేరు శ్రీలత. 1971 నవంబర్ 17న తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలిత దంపతులకు జన్మించారు రోజా. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ అందుకున్న రోజా.. కూచిపూడి నాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ చదువుతుండగానే హీరోయిన్ గా తొలి అవకాశం వచ్చింది. దివంగత నట దర్శక నిర్మాత, రాజకీయ నాయకుడు డాక్టర్ శివప్రసాద్ దర్శకత్వంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన “ప్రేమ తపస్సు” రోజా అరంగేట్ర చిత్రమైంది. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే పరుచూరి సోదరుల దర్శకత్వంలో మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మించిన “సర్పయాగం” చిత్రం, నాటి తమిళ యువ దర్శకుడు ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో రూపొందిన “చంబరత్తి” చిత్రాలు రోజా కెరీర్ ను మలుపు తిప్పాయి. ఆ తరువాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ” “సీతారత్నం గారి అబ్బాయి” చిత్రంతో రోజా అగ్ర కథానాయికగా స్థిరపడ్డారు. చూస్తుండగానే వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయారు రోజా.రోజాకి ఏక కాలంలోనే తెలుగు, తమిళ రంగాల నుండి అవకాశాలు వెల్లువెత్తాయి. రెండు భాషల అగ్ర కథానాయకుల ఫస్ట్ ప్రయారిటీ అయ్యారు రోజా. ఒకవైపు తెలుగు, తమిళ భాషలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమవుతుంటే మరో వైపు కన్నడ, మలయాళ రంగాలు కూడా రోజాను ఆహ్వానించాయి. ఆ విధంగా నాలుగు దక్షిణాది భాషల బహుభాషా నటిగా, శతాధిక చిత్ర కథానాయికగా సంచలన విజయాలు అందుకున్నారు రోజా. అన్ని భాషల్లోనూ టాప్ స్టార్స్ కాంబినేషన్ లో నటించినప్పటికీ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా శుభలగ్నం, స్వర్ణక్క లాంటి ఫ్యామిలీ చిత్రాల్లో, విప్లవ చిత్రాలలో కూడా నటించి ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్, తమిళనాడు ప్రభుత్వ అవార్డ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు రోజా. ఆ విధంగా 1991లో ప్రేమ తపస్సు చిత్రంతో మేకప్ లేకుండా డీగ్లామర్ క్యారెక్టర్లో కనిపించిన రోజా ఆ తరువాత వందలాది చిత్రాల్లో గ్లామర్ క్వీన్ గా సమస్త దక్షిణభారత ప్రేక్షకులను అలరించారు .
దశాబ్దకాలంపాటు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రోజా 1999లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరి క్రమంగా రాజకీయాల్లో ఒక క్రియాశీలక మహిళా శక్తిగా ఎదిగారు. తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా తొలి రాజకీయ పదవి నిర్వహించిన రోజా ఆ సమయంలోనే రాజకీయపరమైన అవగాహనను, అద్భుతమైన వాగ్ధాటిని అలవర్చుకున్నారు. చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజాకు, రాజకీయరంగంలో సంవత్సరం తిరగకుండానే ‘ఫైర్ బ్రాండ్’గా ఎదిగిన రోజాకు హస్తి మసికాంతార వ్యత్యాసం కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక అందమైన నవ్వు, ఆత్మీయమైన పలకరింపు తప్ప మరొక ఊసు ఎరుగని అమాయక, అందచందాల కుందనపు బొమ్మ రోజా. అలా సినిమా రంగంలో పలుకే బంగారమాయెలే… అన్నట్లుగా ఉన్న రోజా.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్దికాలానికే ‘ఫైర్ బ్రాండ్’ రోజాగా మారిపోయారు.
రోజా హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆమెతో అత్యంత సన్నిహితంగా మసలిన మాలాంటి జర్నలిస్టులకు ఆమెలో అంత త్వరగా వచ్చిన మార్పు ఆశ్చర్యంగా అనిపించేది. నిజానికి రోజా అంత వేగంగా రాజకీయ అవగాహనను, వాగ్ధాటిని పెంచుకోగలదని ఎవరూ ఊహించలేదు. ‘సినిమా గ్లామర్ తో తెర మీద డాన్సులు వేసినంత ఈజీ కాదు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం’ అని వ్యాఖ్యానించిన వాళ్ల నోళ్ళు మూతపడ్డాయి రోజా రాజకీయ ప్రస్థాన వేగాన్ని చూసి. ఏది ఏమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతికొద్ది రోజుల్లోనే రోజా ఒక శక్తివంతమైన మహిళగా ఎదగటం అభినందనీయం. అయితే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు సార్లు ఓటమి చవిచూసిన రోజా తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నిరాదరణతో పాటూ, స్థానిక రాజకీయ కుట్రలే తన ఓటమికి కారణమని వాపోతున్న రోజాకు అప్పట్లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి కొండంత అండగా కనిపించారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.ఎస్.ఆర్.సి.పి. రోజాకి ఆత్మీయ స్వాగతం పలికింది. ఇక ఆ రోజు నుండి ప్రారంభమైన రోజా రాజకీయ గర్జన ప్రతిపక్షాల చెవుల్లో సింహ గర్జనలా మార్మోగిపోతోంది. కేవలం రాజకీయ పరమైన ఆవేశకావేశాలతో కాకుండా సమస్యల పట్ల, సమీకరణాల పట్ల, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తిస్థాయి అవగాహనతో, నిర్మాణాత్మకమైన విమర్శలతో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సందిస్తూ “The Lady Voice Of Ysrcp” అనిపించుకున్నారు రోజా.
తెలుగుదేశం వారు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసి పంపిన రోజా వై.ఎస్.ఆర్.సి.పి.కి గోల్డెన్ లెగ్ అయ్యారు. వరుసగా రెండు సార్లు నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందటమే కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పికొట్టడంలో రోజా దూకుడు చూసి ప్రతిపక్ష స్వపక్షాలు సైతం నివ్వెరపోయేవి. 151 మంది వై.ఎస్.ఆర్.సి.పి. శాసనసభ్యుల్లో అతి కొద్దిమంది వాయిస్ మాత్రమే వినపడుతుంది అనుకుంటే వారిలో మరింత ఘాటుగా, దీటుగా, వాడిగా, వేడిగా వినిపించే ఉమెన్ వాయిస్ రోజాదే కావటం విశేషం. తెలుగు దేశం పార్టీ నుండి పొమ్మనలేక పొగబెట్టి వేధించినప్పుడు, నిష్కారణంగా అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరించినప్పుడు ఇంకా ఎన్నో సందర్భాల్లో రోజా కనపరిచిన ధైర్యం, స్థైర్యం, సహన సమ్యమనాలు, ఫైటింగ్ స్పిరిట్ ఏ రంగంలోని మహిళలకు అయినా స్ఫూర్తిగా నిలుస్తాయి. అవమానించబడిన చోటే గౌరవించబడటం, ఓడిన చోటే గెలవటంలో ఉండే కిక్ ఎంత గొప్పగా ఉంటుందో ప్రస్తుతం రోజా కళ్ళలో కనిపిస్తుంది.
గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చాలామంది హీరోయిన్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలిగారు. కానీ.. మంత్రి పదవిని చేపట్టిన తొలి హీరోయిన్ అనే ఘనతను దక్కించుకొని చరిత్ర సృష్టించిన కార్యసాధకురాలు రోజా . సినిమా రంగంలో తిరుగులేని కథానాయిక రోజా. రాజకీయరంగంలో పడి లేచిన కెరటం రోజా. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అనే పసలేని వాదనలకు పదునైన సమాధానం రోజా. ఆత్మవిశ్వాస ప్రపూరిత విజయకేతనం రోజా. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజాకు ‘Hats off ‘ అంటూ All The Best చెబుతోంది సుమన్ టీవీ.