సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. బాధితుల జాబితాలో చిన్నారులు, యువతులు, ముసలి వారు అనే తేడా ఉండటం లేదు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ప్రముఖ నటి, దర్శకురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. పని నిమత్తం బయటకు వెళ్లడానికి సదరు నటి క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక కారు డ్రైవర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించి.. భయపెట్టాడు. చీకటి ప్రాంతంలో క్యాబ్ ఆపి.. మరో వ్యక్తికి కాల్ చేసి ఆమెను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాడు. దీని గురించి సదరు నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ప్రముఖ మరాఠా నటి, దర్శకురాలు మానవ నాయక్‌కు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. లోపలికి ఎక్కి కూర్చున్న తర్వాత ట్యాక్సీ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు.. అలా చేయవద్దని చెప్పినా అతడు వినలేదని చెప్పుకొచ్చింది. అంతేకాక బీకేసీ వద్ద సిగ్నల్ జంప్ చేసి.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు.. పోలీసులు క్యాబ్‌ని ఆపి.. ఫోటో తీస్తే వారితో గొడవపడ్డాడు అని రాసుకొచ్చింది. తాను జోక్యం చేసుకోవడంతో.. ఆ వివాదం సద్దుమణిగిందని తెలిపింది.
గొడవ ఆపినందుకు సంతోషించక.. ఆ క్యాబ్ డ్రైవర్ తన మీదకే రివర్స్ అయ్యాడని.. పోలీసులు విధించిన 500 రూపాయల ఫైన్ ఎవరు చెల్లిస్తారు.. ఆ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని తనను హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత క్యాబ్‌ని డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని తాను చెబితే.. ఓ చీకటి ప్రదేశంలో కారు ఆపాడని.. దాంతో తాను ఉబర్ హెల్ప్ లైన్‌కు కాల్ చేస్తుండగా.. కారు స్పీడ్ పెంచి.. ముందుకు వెళ్లాడని తెలిపింది.
కారు ఆపమని చెప్పినా వినకుండా అలానే వెళ్లాడని.. పైగా ఎవరినో రమ్మని కాల్ చేయసాగాడని తెలిపింది. ఇక తాను భయంతో కేకలు వేయడంతో.. అది గమనించిన కొందరు వాహనదారులు వచ్చి.. తనను రక్షించారని చెప్పుకొచ్చింది. ఈ సంఘటన నుంచి తాను సురక్షితంగా బయటపడ్డప్పటికి.. చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. పోలీసులు దీనిపై స్పందించి.. సదరు క్యాబ్ డ్రైవర్ మీద తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
I took uber at 8.15pm. the uber driver started talking on phone. At BKC signal he jumped the signal.He started arguing. I intervened. He got angry. Said..’ Tu bharegi kyaa 500 rupe’? The uber driver started threatening me..@mybmc @CMOMaharashtra @PMOIndia @MumbaiPolice
— Manava Arun Naik (@Manavanaik) October 15, 2022