ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్. ఆమె గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైటెంగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఆమె మృతి పాటల ప్రపంచంలో తీరని లోటు. 30కి పైగా భాషాల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్ తెలుగులో మూడు పాటలు పాడారు. అవి మీ కోసం..
1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా.. సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతాజీ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిగా సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్.
చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.