గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది.
చిన్న పిల్లలను దత్తత తీసుకునే విషయంలో ప్రతీ ఒక్కరూ గవర్నమెంట్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. విచారణ ముగిసిన తర్వాత కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ఆమె ,మాట్లాడుతూ.. “నేను పాపను దత్తత తీసుకోవాలనుకుంటే న్యాయపరంగానే తీసుకుంటాను. ఇంకా పాపను దత్తత తీసుకోలేదు. ఆ పాప తల్లిదండ్రులే నాతో పాటు ఉంటున్నారు. విచారణ పూర్తవగానే అధికారులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రెండు రోజుల నుండి నాపై అనేక ఆరోపణలు వచ్చాయి. నా తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారు.. నేనే వారికి ధైర్యం చెప్పాను.
నాపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయనాయకులు, అధికారులు ఉన్నారు. నాపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై త్వరలోనే కోర్టుకు వెళ్తాను” అని మాట్లాడారు. ఇటీవలే కళ్యాణి అక్రమంగా పిల్లలను దత్తత తీసుకోవడం, కొనుగోలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతుందంటూ చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నం.1098కు ఫిర్యాదు అందగా సంబంధిత అధికారులు, పోలీసులు ఆమె ఇంటిని సోదా చేశారు. అయితే.. తాను ఆ పాపను దత్తత తీసుకోలేదని, తనను కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని కళ్యాణి ఆరోపించింది. ఇక మంగళవారం విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి వెళ్లగా అధికారులు లేకపోవడంతో బుధవారం మరోసారి హాజరైంది. మరి కరాటే కళ్యాణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.