సినీ నటుడు, నందమూరి తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమం హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
సినీ నటుడు, నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి విదితమే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నఫిబ్రవరి 18న బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన తెలుగు ప్రేక్షకులను, నందమూరి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఇదిలావుంటే.. తారకరత్న దశ దిన కర్మను గురువారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సోదరుడిని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
తారకరత్న దశ దిన కర్మ కార్యాక్రమాన్ని హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇక నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు తార్నకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం అలేఖ్యను పరామర్శించారు. పిల్లల్ని దగ్గరకు తీసుకొని.. వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఈ క్రమంలో తార్నకరత్న భార్య అలేఖ్య భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంది. కాగా, జనవరి 26న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్నికి తరలించారు. అక్కడ 23 రోజులపాటు చికిత్స పొందిన ఆయన మహాశివరాత్రి రోజున కన్నుమూశారు.