తెలుగు ఇండస్ట్రీలో సున్నితమైన ప్రేమకథలను తెరపై ప్రేమకావ్యంలా చూపించగల దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. గతంలో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా దర్శకుడు కరుణాకరన్ పేరు తెచ్చుకున్నాడు. దాదాపు కరుణాకరన్ కెరీర్ లో అన్నీ లవ్ స్టోరీస్ తెరకెక్కించారు. ఇక ఇప్పుడున్న దర్శకులలో హను రాఘవపూడి ప్రేమకథల స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. తన మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ మొదలుకొని కృష్ణగాడి వీరప్రేమగాథ, పడిపడి లేచే మనసు, లై.. తాజాగా సీతారామం వరకు ఎక్కువగా అన్ని కథలను ప్రేమకు ముడివేసి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే.. పడిపడి లేచే మనసు తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘సీతారామం’ మూవీ తీశాడు హను.
మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లను టాలీవుడ్ కి పరిచయం చేస్తూ తెరకెక్కించిన లవ్ స్టోరీ ‘సీతారామం. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. విడుదలైన ప్రతి చోటా కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం దర్శకుడు సీతారామం సక్సెస్ ని ఆస్వాదిస్తూనే.. తదుపరి ప్రాజెక్ట్ పై వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. హను రాఘవపూడి తదుపరి సినిమాగా ఓ మల్టీస్టారర్ అనుకుంటున్నాడట. అదికూడా తాను ఇదివరకే పని చేసిన హీరోలతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. నాని, శర్వానంద్. గతంలో నానితో కృష్ణగాడి వీరప్రేమగాథ, శర్వాతో పడిపడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు హను.
ఇక ఇప్పుడు వారిద్దరితో మల్టీస్టారర్ స్టోరీ సిద్ధం చేశాడని.. అదికూడా ఇద్దరు హిందూ ముస్లిం స్నేహితుల చుట్టూ తిరుగుతుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీని నిర్మించేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ సిద్ధమైందని సమాచారం. హనుకి నాని, శర్వాలతో మంచి ర్యాపో ఉందని తెలిసిందే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే డైరెక్టర్ హను నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు నాని దసరా సినిమాతో, శర్వా తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకాలం ప్రేమకథలు తెరపై చూపించిన హను.. మల్టీస్టారర్ లో ఎలాంటి కథ చెప్పనున్నాడో వేచి చూడాలి. మరి హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.