మహిళ అంటే భూమాతకున్నంత ఓర్పు ఉండాలి.. కుటుంబాన్ని, ఇంటిని చక్కదిద్దుకోవాలి. తన ఆరోగ్యం బాగా లేకపోయినా సరే.. కుటుంబం కోసం అన్ని పనులు చేయాలి.. మన సమాజంలో చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణి కరెక్ట్ కాదు అంటున్నారు నటి ఇంద్రజ. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
మరో రెండు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోబోతున్నాం. ప్రస్తుతం ప్రతి చోటా మహిళలు, వారు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా సరే.. మన దగ్గర మాత్రం ఇంకా ఆడా, మగా సమానం అనే భావన రాలేదు. నేటి కాలంలో మహిళలు కూడా మగవారితో సమానంగా ప్రతి రంగంలో పోటీ పడుతూ.. అంతరిక్షంలోకి సైతం దూసుకెళ్తున్నప్పటికి.. మన దగ్గర వారికి కనీసం సగ భాగం కాదు కదా.. 33 శాతం అవకాశాలు ఇవ్వడానికి కూడా మన మగ మహారాజులకు మనసు రావడం లేదు. పని చేయడంలో, సంపాదనలో దేనిలో కూడా మహిళలు ఇప్పుడు మగవారికి తక్కువగా లేరు. కానీ వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ నటి ఇంద్రజ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.
మహిళ దినోత్సవం సందర్భంగా ఓ కంపెనీ నెలసరి సమయంలో మహిళలకు ఉపయోగపడే ప్రత్యేక ఉత్పత్తిని మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా నటి ఇంద్రజను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు.. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. ‘‘నేటికి కూడా కొన్ని యాడ్స్‌లో మహిళలు.. ఆర్థిక అవసరాల కోసం మగవారి మీద ఆధారపడుతున్నట్లు చూపుతున్నారు. కానీ వాస్తవంగా పరిస్థితి వేరు. ఇప్పుడు ఆడవారు కూడా మగవారితో సమానంగా, అంతకు మించి సంపాదిస్తున్నారు. మహిళలే మగాళ్లను పోషిస్తున్నారు. అలానే ఆడవారు తమ సమస్యల గురించి అర్థం చేసుకోమని మగవారిని పదే పదే అడగడం కూడా వృధా. మన ప్రాబ్లమ్స్‌ని మనలో మనమే ఓపికగా భరిస్తూ.. ఉంటేనే మగవాళ్లు అర్థం చేసుకుంటారు. వారి మెంటాలి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లో పని చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు ఇంద్రజ.
‘‘అలానే ఇంటిని, కుటుంబాన్ని మొత్తాన్ని మీ భుజ స్కంధాల మీదనే మోయాలని ఆరాటపడకండి. అలా అన్ని పనులు మీ మీద వేసుకుని కష్టపడుతూ.. ఆ తర్వాత గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడటం కూడా కరెక్ట్ కాదు. మీకు ఓపిక లేదా.. పని చేయలేరా.. ఆ విషయం మీ వాళ్లకు చెప్పి రెస్ట్ తీసుకోండి. మీ గురించి మీరే ఆలోచించుకోకపోతే.. మీ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి మీరు పట్టించుకోకపోతే.. ఇక మగాళ్లు అర్థం చేసుకోవాలని కోరుకోవడం ఎంత వరకు సమంజసం’’ అని ప్రశ్నించారు.
‘‘ఇక నెలసరి గురించి, ఆ సమయంలో తలెత్తే సమస్యల గురించి చర్చించడానికి అసలు మొహమాట పడకండి. ఎందుకంటే.. నెలసరి అనేది మహిళలను మాతృత్వానికి దగ్గర చేసే గొప్ప వారధి. దాని గురించి గర్వంగా ఫీలవ్వాలి. ఇక మన సమాజంలో.. మహిళలను అర్థం చేసుకునే మగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం వేసుకునే బట్టలని బట్టే మనల్ని జడ్జ్ చేసే అథమ స్థాయిలోనే ఉన్నారు. చాలా మంది మగాళ్ల మైండ్ సెట్ ఇలానే ఉంటుంది. అలాంటి వారు మనల్ని అర్థం చేసుకుని అండగా ఉండాలని ఎన్నడు కోరుకోకండి. ఇది మీ జీవితం. ఎస్ చెప్పాల్సిన సమయంలో ఎస్ చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే స్పష్టంగా నో చెప్పండి. మీ జీవితం ఇది. మీకు నచ్చినట్లు.. పూర్తి స్థాయిలో జీవించండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఇంద్రజ వ్యాఖ్యలపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.