కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినిమా ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త వినగానే కన్నడనాట అభిమానులు గుండె బద్దలైంది. మొత్తం కన్నడ సినిమా అభిమానులు, తారలే కాదు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా సెలబ్రిటీలు, అగ్రతారలు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు బెంగళూరు పయనమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సినిమాలు పెద్దగా తెలుగులోకి డబ్ అయ్యినవి లేవు. యాక్టిగ్ పరంగా పునీత్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కానీ, పునీత్ మరణ వార్త వినగానే తెలుగు ప్రజలు సైతం గుండెబద్దలయ్యేలా విలపించారు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సందేశాలు పెడుతున్నారు. వాటిలో ఒక అభిమాని రాసిన ఓపెన్ లెటర్ ఒకటి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆ లేఖ యథాతథంగా మీకోసం.
‘పునీత్ రాజ్ కుమార్’ అలియాస్ అప్పు అన్నకు.. ఒక తెలుగువాడిగా బరువెక్కిన గుండెతో రాస్తున్న చివరి లేఖ. అన్నా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పునీత్ రాజ్ కుమార్ కు అశృనివాళి అనే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఏ పోస్టు చూసినా మీ పేరే కనిపిస్తోంది. కానీ మిమ్మల్ని ఎంతగానో అభిమానించే ఒక మనిషిగా నేను దానిని అంగీకరించలేకపోతున్నాను. మీరు మా మధ్య లేరు అనే మాటను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా ప్రమేయం లేకుండానే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా మనసును నీ గురించి ఆలోచించకుండా ఆపలేకపోతున్నాను. ఎందుకన్నా ఇంత త్వరగా వెళ్లిపోయావు. నలుగురు పిల్లలు చదువుకోవాలని కోరుకున్నావు.. నలుగురు పెద్దవాళ్లకు ఆశ్రయం కల్పించాలని భావించావు.. నాలుగు మూగ జీవాల ఆకలి తీర్చావు.. ఆడపిల్లలు నలుగురిలో తలెత్తుకు జీవించాలని కలలు కన్నావు.. ఇలా నలుగురి మంచి కోరుకునే నువ్వు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి కదన్నా? ఎందుకు ఇలా 45 ఏళ్లకే ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయావు? నువ్వుంటే ఆ దేవుడిని ఈ ప్రజలు తలుచుకోరు అని అనుకున్నాడా? నీ సేవాకార్యక్రమాలు చూసి కన్ను కుట్టి నిన్ను ఇంత త్వరగా తీసుకెళ్లాడా?
నీ కోసం నాలాంటి ఎందరో తెలుగు ప్రజలు గుండెలవిసేలా ఏడుస్తున్నారన్నా. నీ కోసం ఏడుస్తున్న ఈ హృదయాలు నీ నటనకో, నీ డాన్సుకో, నీ ఫైట్లు చూసో అభిమానించేవి కాదు. నీ వ్యక్తిత్వం, సాటి మనిషి కోసం నువ్వు చేస్తున్న సేవను చూసి నీకు అభిమానులుగా మారిన వారి బాధ ఇది. ఒక మనిషి నూరేళ్లు గుర్తుండాలంటే అతను వంద సంవత్సరాలు బతికుండాల్సిన అవసరం లేదు అని నిరూపించిన వ్యక్తివి నువ్వు. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే నీ ముఖం ఇక తెరపై కనిపించదు అంటే తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఏం జరిగినా అది దేవుడి తలరాతే అని నువ్వు నమ్మే మాటనే మరోసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అగ్రతార అనే భావన ఎక్కడా లేకుండా నువ్వు ఒక సాధారణ వ్యక్తిగా జీవించిన తీరు భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. నువ్వు మళ్లీ మా మధ్యకు రావాలి. ఆ దేవుడికి మంచి మనసు ఉంటే నిన్ను మళ్లీ మా మధ్యకు పంపుతాడు. ఇలాంటి కష్ట సమయాన్ని ఎదుర్కొనే శక్తి, మనోధైర్యం మీ కుటుంబానికి, అభిమానులకు రావాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి…
చూశారుగా ఒక కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విన్నాక ఒక తెలుగు అభిమాని రాసిన భావోద్వేగ లేఖ ఇది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా ఒక హీరోగా పునీత్ సంపాదించుకున్న అభిమానం కాదు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వమున్న మనిషిగా పునీత్ సంపాదించుకున్న అభిమానం. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి కోరుకుందాం.