ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని కల్పించడంతో పాటు కోర్సు పూర్తయ్యాక జాబ్ కూడా ఇస్తుంది. నెలకు రూ. లక్ష జీతాన్ని కూడా ఇస్తుంది.
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని ఇండియన్ ఆర్మీ కల్పిస్తోంది. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ కోర్సును పూర్తి చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం పొందవచ్చు. జేఈఈ మెయిన్ 2023 స్కోరుతో ఈ కోర్సుకి, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ చేసిన వారిని రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఐదేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీంకి ఎంపికైన వారికి 2024 జనవరి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి.
శిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి బీటెక్ డిగ్రీతో పాటు ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. విధుల్లో చేరిన వారికి నెలకు రూ. లక్ష వేతనం ఇస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. మొదటిరోజు మొదటి దశ స్క్రీనింగ్ (ఇంటిలిజెన్స్) పరీక్షల్లో అర్హత సాధించిన వారిని రెండవ దశకి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించి అన్ని విభాగాల్లో రాణించిన వారిని కోర్సు, శిక్షణకు తీసుకుంటారు.