ఇంజనీర్లు అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కంప్యూటర్ ఇంజనీరో, సివిల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో ఇలా ఇంజనీరింగ్ విభాగంలో ఏదో ఒక ఇంజనీర్ గా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే ఆర్థిక స్థోమత అనేది యువత కలలకు ఆటంకం అవుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల కలలకి డబ్బు ఆటంకం కాకూడదని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లను అందజేస్తుంది. ఫ్యూచర్ ఇంజనీర్ల కోసం అమెజాన్ సంస్థ స్కాలర్ షిప్ లను అందజేస్తుంది. ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థినులకు ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ స్కాలర్ షిప్’ పేరిట ఏడాదికి 40 వేల ఆర్థిక సహాయం అందజేసేందుకు సిద్ధంగా ఉంది.
దేశంలోని యువ విద్యార్థినులు కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం, కెరీర్ అవకాశాలు పొందేలా స్కాలర్ షిప్ లను అందజేస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా ఇతర బ్రాంచుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఈ స్కాలర్ షిప్ వర్తిస్తుంది. ఈ స్కాలర్ షిప్ స్కీం కింద అమ్మాయిలు ఏడాదికి 40 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల్లో లక్షా 60 వేలు స్కాలర్ షిప్ పొందుతారు. ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థినుల టెక్ కెరీర్, స్కిల్ బిల్డింగ్, అలానే నెట్ వర్కింగ్ అవకాశాలు, అమెజాన్ ఇంటర్న్ షిప్ వంటివి పొందే అవకాశం కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగంలో తమ కెరీర్ ని గొప్పగా తీర్చిదిద్దుకునే విధంగా అమెజాన్ సంస్థ.. స్కాలర్ షిప్ తో అమ్మాయిలను ఇన్స్పైర్ చేస్తోంది.
ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాం ద్వారా అమ్మాయిలు ఉత్తమ క్రియేటర్స్ గా, ఉత్తమ బిల్డర్స్ గా, ఉత్తమ ఆలోచనాపరులుగా ఎదిగే అవకాశం ఉంది. దేశంలో ఉన్న అమ్మాయిలు టెక్ నిపుణులు అయ్యేందుకు కావాల్సిన సంపూర్ణ అభ్యాస అవకాశాన్ని కల్పించడమే ఈ స్కాలర్ షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన ఫౌండేషన్ ఫర్ ఎక్స్లెన్స్ తో కలిసి ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాంని అమలుచేస్తున్నారు. ఎవరైతే ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు.