DC vs GT Prediction: గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి మంచి జోష్ లో ఉంది.. మరోవైపు ఢిల్లీ తొలి మ్యాచ్‌లో లక్నోపై ఓడి.. తొలి గెలుపుకోసం కసితో ఉంది. మరి ఈ రెండు జట్ల మధ్య పోరులో విజయం ఎవరిని వరించే అవకాశం ఉందంటే..
ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ పూర్తి చేసుకోగా చెన్నై, లక్నో రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై రెండో మ్యాచ్‌లో గెలిచింది. అలాగే తొలి మ్యాచ్ గెలిచిన లక్నో.. రెండో మ్యాచ్‌లో ఓడింది. ఇలా అన్ని జట్లు బలాబలాల విషయంలో దాదాపు సమవుజ్జీలుగా ఉండటంతో.. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారుతోంది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. గుజరాత్ ఆరంభ మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. మంచి జోష్‌లో ఉంది. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్.. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. మరి ఈ రెండో మ్యాచ్‌లోనైనా విజయం సాధించి.. ఈ సీజన్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. మరి ఈ రెండు జట్ల బలం బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ టైటాన్స్..
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్.. ఆ ట్యాగ్‌కు న్యాయం చూస్తూ.. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా దాదాపు సేమ్ జట్టుతో గుజరాత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే.. తొలి మ్యాచ్‌లో గుజరాత్ మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు సాహా, గిల్ మంచి ఓపెనింగ్ సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా దాన్ని కొనసాగించలేకపోయారు. చివర్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా భారీ షాట్లు ఆడకపోయి ఉంటే.. గుజరాత్‌కు గెలుపు సాధ్యం అయ్యేది కాదు. గతేడాది కూడా చివర్లో ఈ ఆటగాళ్లు చెలరేగడంతోనే గుజరాత్ చాలా మ్యాచ్‌ల్లో నెగ్గింది. మిడిల్డార్ సమస్య అధిగమిస్తే.. గుజరాత్ మరింత పటిష్టంగా మారుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్..
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, రోసోవ్ తప్ప.. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. పేపర్‌పై జట్టు చూసేందుకు భీకరంగా ఉన్నా.. తొలి మ్యాచ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. ఢిల్లీ బౌలింగ్ కాస్త వీక్ అనే చెప్పవచ్చు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉన్నా.. పేస్ దళం బలహీనంగా ఉంది. చేతన్ సకారియా, ముఖేష్ కుమార్ పేసర్లుగా ఉన్నారు. అయితే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో అన్రిచ్ నోర్జె బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోమన్ పావెల్, అమన్ ఖాన్, అక్షర్ పేటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మాద్.
గుజరాత్ టైటాన్స్: గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జోసెఫ్, షమీ, సాయి సుదర్శన్, జోస్ లిటిల్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలం బలహీనతలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఉంది. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ జరుగుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.