ఏ బంధమైనా సరే.. కలకాలం నిలవాలంటే.. ప్రధానంగా కావాల్సింది నమ్మకం, గౌరవం. ఆ తర్వాతే మిగతావి. నమ్మకం లేని బంధం ఎంతో కాలం కొనసాగదు. మిగతా బంధాలతో పోలిస్తే.. వివాహ బంధంలో భాగస్వాములిద్దరూ ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకోవాలి.. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. అనుమానం అనే భూతం ఒక్కసారి భార్యాభర్తల బంధంలోకి ప్రవేశిస్తే.. ఇక దాన్ని తొలగించడం అంత తేలిక కాదు. బుర్రలోకి అనుమానం ప్రవేశిస్తే.. ఇక అది చేసే దారుణాలు ఊహించడం కూడా కష్టమే. ఆఖరికి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా సాగాల్సిన వారి బంధంలోకి అనుమానం ప్రవేశించింది. ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న భర్తే.. నిత్యం అనుమానించి.. వేధింపులకు గురి చేయడంతో.. తట్టుకోలేకపోయింది.. ఆఖరికి భర్త చేతిలోనే తనువు చాలించింది ఆ మహిళ. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన తమిళనాడు.. తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. సెయ్యారు తాలుకా అన్న పుదూరు గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఎదురింట్లో.. ఉండే కౌసల్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి.. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఏడాది వయసున్న ఓ కుమారుడు ఉన్నాడు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం.. పండంటి బిడ్డ.. ఈ జీవితం ఇలా సంతోషంగా సాగిపోతే చాలనుకుంది కౌసల్య.
అయితే సంతోషంగా సాగుతున్న వారి జీవితాల్లోకి అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. ఈ క్రమంలో రంజిత్.. కౌసల్యతో తరచూ గొడవపడేవాడు. అంతేకాక.. వరకట్నం కోసం వేధించేవాడు. రంజిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా కౌసల్యను కట్నం కోసం వేధించేవారు. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో.. కొన్ని నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది కౌసల్య. దాంతో.. వారు భార్యాభర్తలిద్దరిని పిలిచి.. కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి పంపించారు.
కొన్ని రోజుల పాటు వారిద్దరూ బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం.. 4 గంటల సమయంలో.. రంజిత్, కౌసల్యల మధ్య మరోసారి గొడవ జరిగింది. దాంతో ఆగ్రహించిన రంజిత్.. తాలిబొట్టు దారంతోనే.. ఆమె గొంతుకు బిగించి.. హత్య చేసి.. కుమారుడిని తీసుకుని.. ఇంటి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి రంజిత్ కోసం గాలిస్తున్నారు.