శుభకార్యానికి వెళుతోన్న ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది.. ఒక సారి వారు తప్పించుకున్నారు. అయిన మృత్యువు వదల్లేదు.. రెండోసారి వెంటాడింది. చివరకి వారి కుటుంబంలోని తల్లికూతురిని బలితీసుకుని. మృత్యువే గెలిచింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో ఆదివారం చోటుచేసుకుంది.
గుమ్మడిదల పోలీస్ స్టేషన్ ఎస్సై విజయకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. గుమ్మడిదలకు చెందిన కుమ్మరి బ్రహ్మచారి(32),ఆయన భార్య కల్పన(25), కూతురు శివాని(4), కొడుకు కార్తీక్(2) ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆదివారం బైక్ పై బొల్లారంకి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు బ్రహ్మచారి కుటుంబం బైక్ పై గుమ్మడిదల నుంచి బొలారంకి బయలుదేరింది. దోమడుగు వద్దకు రాగానే, అక్కడి మూల మలుపు వద్ద వీరి వాహనం అదుపుతప్పి పడిపోయింది. నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అన్నారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
ఈ ప్రమాదంతో పిల్లలు భయపడ్డారు.
దీంతో ఇక శుభకార్యానికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. తిరిగి అదే బైక్ పై తమ గ్రామానికి బయలుదేరారు. తిరుగుప్రయాణంలో మళ్లీ దోమడుగు పరిధిలోకి రాగానే మరో మలుపు వద్ద బ్రహ్మచారి బైక్ రెండోసారి అదుపుతప్పి, డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బండి మీద నుంచి ఆ నలుగురూ ఎగిరిపడ్డారు. స్థానికులు వారిని గుర్తించి నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే తల్లీకూతుళ్లు కల్పన, శివానీ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ బ్రహ్మాచారి, కార్తీక్ ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాదకరమైన సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.