తమకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేకుంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని ఇద్దరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డంతో యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబైలో గురువారం చోటుచేసుకుంది. ముంబైలో ఉంటున్న భోజ్‌పురీ ఇండస్ట్రీకి చెందిన యువ నటి.. స్నేహితులతో కలిసి ఒక పార్టీలో పాల్గొంది. ఈ పార్టీపై ఇద్దరు వ్యక్తులు ఎన్‌సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులం అంటూ రైడ్ చేసి వారి వద్ద రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. మొత్తానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
కానీ అంత డబ్బు ఎలా సమకూర్చాలో అర్థంకాక యువ నటి సతమతమైంది. పైగా రైడ్ చేసిన వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ముంబైలో తను నివసించే ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఆమె ఫ్రెండ్ ద్వారా పోలీసులకు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపించగా.. ఎన్‌సీబీ అధికారులం అని చెప్పిన పరదేశి, పర్వీన్ వాలింబేలు నకిలీ పోలీసులుగా తేలింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న నటి ఫ్రెండ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె ప్లాన్ ప్రకారమే నకిలీ పోలీసులుగా వారిద్దరు నటిని వేధించినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు నటి ఫ్రెండ్ కోసం గాలిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.