అత్యాచార కేసులో ఓ నటుడు అరెస్టుకావడంతో సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలంరేపింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, బెదిరింపులకు దిగుతున్న నటుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుత సమాజంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఎక్కువగా పెరిగిపోయాయి. మృగాళ్ల బారిన పడి ఎందరో మహిళలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు మహిళల్ని వంచిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికి మహిళలపై జరిగే దారుణాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు. ఈ క్రమంలో సినిమా రంగానికి చెందిన ఓ నటుడు అత్యాచార ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఇంతకీ ఎవరు ఆ నటుడు? అసలు ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం..
కన్నడ పరిశ్రమకు చెందిన నటుడు, ప్రొడ్యూసర్ అయిన వీరేంద్ర బాబు అత్యాచార ఆరోపణల్లో అరెస్టయ్యాడు. అతడిని బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. 2021లో అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళను నటుడు విరేంద్ర బాబు అత్యాచారం చేశాడని కేస్ నమోదైంది. బాధిత మహిళ తనను అత్యాచారం చేసిన తర్వాత దానికి సంబంధించిన వీడియో చూపిస్తూ బెదిరిస్తున్నాడని.. ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తు రూ. 15 లక్షలు ఇవ్వాలని, లేకపోతే ఆ వీడియోను లీక్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గత జూలై 30వ తేదీన కూడా విరేంద్ర మళ్లీ ఆ మహిళకు ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతడు బెదిరించడమే కాకుండా గన్‌తో కాల్చి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి వీరేంద్ర బాబు, అతని స్నేహితులపై కొడిగేబళ్లి అనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.