‘ప్రేమ‘ ఈ రెండు అక్షరాలకున్న మాయేంటో తెలియదు కానీ, ఈ పేరుతో రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. మనసారా ప్రేమిస్తున్న యువతి ఎక్కడున్నా పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకోవడం పోయి.. దాడులకు ఎగబడుతున్నారు. ప్రేమను అంగీకరించలేదని కొందరు, పెళ్ళికి ఒప్పుకోలేదని మరికొందరు ప్రేమించిన వారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి వేరోకరికి దక్కకూడదన్న దుర్భుద్ధితో యువతిపై దాడికి పాల్పడ్డాడు..ఓ యువకుడు.
వివరాల ప్రకారం.. కర్నాటకలోని దావణగెరె ప్రాంతానికి చెందిన సుల్తానా అనే యువతిని, అదే ప్రాంతానికి చెందిన సాదత్ అలియాస్ చాంద్‌పీర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. మొదట నువ్ అందంగా ఉన్నావ్ అంటూ మాటలు కలిపిన అతడు, అనంతరం ప్రేమిస్తున్నా అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె ఇంటికి వెళ్లి యువతిని పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఇంకోసారి తమ కూతురు వెంటపడితే పోలీసు కేసు పెడతామని హెచ్చరించి వదిలేశారు. ఇదే వారుచేసిన తప్పు.
అనంతరం కొంతకాలం.. కామ్ గా ఉన్న యువకుడు అమ్మాయిని నిరంతరం ఫాలో అయ్యేవాడు. ఎటు వెళ్తుంది..? ఏం చేస్తుంది..? అన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ఈ క్రమంలో సుల్తానాకు ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సాదత్, తాను ప్రేమించిన యువతి వేరొకరికి దక్కకూడదన్న దుర్బుద్ధితో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. గురువారం ఓ షాపు వద్ద ఉన్న సుల్తానా దగ్గరకు వెళ్లిన సాదత్.. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించి తనతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం, విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ఉయువతి మరణించగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.