ఏళ్లుగా తన దగ్గరే నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అనే ధైర్యంతో ఓ మహిళ.. డ్రైవర్ చేతికి కోట్ల రూపాయల నగలు ఇచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్ ఆ సొమ్ముతో ఉడాయించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కానంతగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి పరిస్థితులు, అవసరాలు కావు ప్రస్తుతం ఉన్నవి. వెనకటి రోజుల్లో అయితే.. కొందరు సేవకులు ఏళ్ల తరబడి తరతరాలుగా తాము పని చేస్తున్న కుటుంబాలకు నమ్మకంగా ఉండేవారు. వాళ్లనే కాకుండా సమాజంలో కూడా చాలా మంది పరుల సొమ్మును పాముగా భావించేవారు. అక్రమ సంపాదన అంటే ఒణికిపోయేవారు. మరి ఇప్పుడో.. ఏం చేశాం.. ఎలా సంపాదించాం అన్నది కాదు ముఖ్యం.. డబ్బులు ఉన్నాయా లేవా అదే లెక్క అన్నట్లుగా మారాయి పరిస్థితులు. అవకాశం దొరికితే చాలు అందినకాడికి సర్దేసి ఉడాయించే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇక అప్పుడప్పుడు ఇళ్లల్లో పని చేసేవారు.. యజమాని ఇంటికి కన్నం వేసే వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ తరహా దొంగతనం ఒకటి వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా నటిస్తూ.. కోట్ల రూపాయల విలువైన వజ్రాల ఆభరణాలతో పరారయ్యాడు ఓ డ్రైవర్. ఆ వివరాలు..
ఈ సంఘటన హైదరాబాద్, అమీర్‌పేటలో చోటు చేసుకుంది. నమ్మకంగా నటిస్తూ.. అవకాశం దొరకగానే భారీ నగదుతో ఉడాయించాడు ఓ కారు డ్రైవర్. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న రాధిక అనే మహిళ.. బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఈ క్రమంలో అదే అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న అనూష అనే మహిళ.. రాధిక దగ్గర 50 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు ఆర్డర్ చేసింది. శుక్రవారం మధురానగర్ వెళ్లిన అనూష.. తాను ఆర్డర్ చేసిన ఆభరణాలను మధురానగర్‌కు పంపమని రాధికను కోరింది.
దాంతో రాధిక తన డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్‌మెన్ అక్షయ్‌ల ద్వారా అనూషకు ఇవ్వాల్సిన ఆభరణాలను పంపింది. ఇవే కాక.. సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జ్యువెల్స్‌కు తిరిగి ఇవ్వాల్సిన 7 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలను కూడా డ్రైవర్, సేల్స్‌మెన్‌లకు అప్పగించింది రాధిక. ఇక మధురానగర్ వెళ్లిన తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులోనే ఉండగా.. అక్షయ్.. ఇంట్లోకి వెళ్లి అనూష నగలను ఆమెకు అప్పగించి వచ్చేలోపు శ్రీనివాస్.. కారులో ఉన్న 7 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. సేల్స్‌మెన్ అక్షయ్ ఈ విషయం రాధికకు తెలియజేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.