నేటి రోజుల్లో పెళ్లి అన్న పదానికి.. ఆ బంధానికి విలువే లేకుండా చేస్తున్నారు కొందరు మహానుభావులు. తప్పుడు దారులు తొక్కేది కొందరైతే, దొంగ పెళ్లిల్లు చేసుకునే వారు కొందరయ్యారు. అలా ఓ హోం గార్డు చేసిన తప్పుకు ఓ అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. మొదటి పెళ్లి సంగతి దాచి దర్జాగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అసలు విషయం తెలిసి దూరం అయ్యేందుకు సిద్ధమైంది కానీ చివరికి ఆత్మహత్యే తనకు దారనుకుంది.
వడ్డె గోపాల్ షాద్‌నగర్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతడి స్వగ్రామం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం మందిపల్ గ్రామం. అతడికి గతంలోనే వివాహం జరిగింది. ఆ విషయాన్ని దాచిపెట్టి శిరీష(25)ను వివాహం చేసుకున్నాడు. షాద్‌నగర్‌కు చెందిన ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. రెండు నెలలుగా డ్యూటీ మానేసి శిరీష దగ్గరే ఉంటున్నాడు గోపాల్. ఏదో పని మీద సొంతూరు వెళ్లగా గోపాల్ నిర్వాకం బయటపడింది. అతడు రెండో వివాహం చేసుకున్న విషయం మొదటి భార్యకు తెలిసింది. మొదటి భార్య కుటుంబసభ్యులు అందరూ కలిసి ఊర్లో పంచాయతీ పెట్టి రెండో భార్యను వదిలేయాలంటూ సూచించారు. అందుకు గోపాల్ కూడా అంగీకరించాడు. శిరీషకు జరిగిన అన్యాయానికి కొంత డబ్బు చెల్లించాలని నిర్ణయించుకున్నారు.
ఒప్పందం చేసుకున్న విధంగా తనకు నగదు ఇవ్వాలంటూ శిరీష డిమాండ్ చేసింది. గోపాల్ డబ్బు ఇవ్వడంలో జాప్యం చేస్తూ వస్తున్నాడు. గురువారం రెండో భార్య శిరీషతో కలిసి గోపాల్ మందిపల్ గ్రామానికి వచ్చాడు. ఇద్దరు భార్యలు ఒకే దగ్గరకు చేరుకున్నప్పుడు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ రోడ్డుపై జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వివాదం తర్వాత అవమానంగా భావించిన శిరీష ఇంట్లోంకి వెళ్లి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష మృతికి గోపాల్ కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.