“వైద్యో నారాయణో హరీ” అని పెద్దలు అంటుంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. కానీ నేటికాలంలో ఆ పదానికి అర్థం మారిపోయింది. వైద్యం కోసం వెళితే ప్రాణాలు పోతాయన్నది వాడుకలోకి వచ్చిన కొత్త అర్థం. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులలో మనిషి ప్రాణానికి ‘రేటు’ కట్టేయడం సర్వసాధారణమైపోయింది. డబ్బు మీద ఉన్న ఆశతో మనిషి ప్రాణలు కాపాడే విషయంలో లేకపోవడం దురదృష్టకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
తాజాగా పురిటి నొప్పులతో ఆస్పత్రికి చేరిన మహిళ, వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన దండు మంగమ్మ ప్రసవం కోసం నవంబర్ 28న మండలంలోని భాస్కర ఆసుపత్రికి వెళ్లింది. 29న డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ సమయంలో కాటన్ గుడ్డను కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు వేశారు. అనంతరం పది రోజులపాటు ఆస్పత్రిలో మంగమ్మను ఉంచుకున్నారు. ఆమెకు ఎంతకూ కుట్లు మానకపోవడంతో పాటు కడుపు నొప్పి వస్తుండటంతో ఆమె భర్త మాణిక్యం డాక్టర్లను నిలదీసాడు.
దీంతో ఆసుపత్రి సిబ్బంది రకరకాల మందులు వాడమని చెప్పి కాలయాపన చేశారు. ఆ మహిళకు కడుపు నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో చివరికి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ నెల 8న ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు సైతం ఇక్కడ కాదని తేల్చేసారు. చేసేదేం లేక అదే రోజు రాత్రి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మంగమ్మను తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు స్కానింగ్ చేసి కడుపులో ఏదో గుడ్డ ఉందని గుర్తించారు. శుక్రవారం ఆపరేషన్ చేసి ఆ కాటన్ గుడ్డను బయటికి తీశారు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.
మంగమ్మ భర్త మాణిక్యం, అతని బంధువులతో కలిసి శనివారం సాయంత్రం భాస్కర ఆస్పత్రికి చేరుకొని డాక్టర్లను నిలదీశారు. ఈ విషయమై ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ని వివరణ కోరగా.. తాను రెండు రోజులుగా సెలవులో ఉన్నానని, సంఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపడతామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి వైద్యులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.