ఢిల్లీలోని అంజలి సింగ్ కారు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంగళవారం ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరగలేదని, ఆమె ప్రైవేట్ పార్ట్ కు కూడా ఎలాంటి గాయాలు కూడా జరగలేదని తెలిపారు. అయితే తాజాగా ఇదే ఘటనపై మరిన్ని భయనక నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంజలి సింగ్ ను కారు దాదాపుగా 13 కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా దెబ్బ తినిందని అధికారులు తెలిపారు. ఇదే కాకుండా ఆమె శరీరంపై దాదాపు 40 గాయాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె వెనక భాగం పూర్తిగా చిద్రమవ్వడంతో పాటు వెన్ను ముక్క విరిగిపోవడం, తల భాగానికి తీవ్రంగా గాయాలై మెదడు కనిపించకుండపోయిందని అధికారులు తెలిపారు. దీంతో కాళ్లు పూర్తిగా విరిగిపోవడంతో పాటు మరికొన్ని చోట్ల తీవ్ర గాయలయ్యాయని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
నూతన సంవత్సరం రోజు రాత్రి అంజలి సింగ్, తన ఫ్రెండ్ తో కలిసి ఓ పార్టీకి హాజరై తెల్లవారుజామున సుల్తాన్ పూర్ ప్రాంతం గుండా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు ప్రయాణిస్తున్న ఓ కారు అంజలి సింగ్ స్కూటీని ఢీ కొట్టింది. దీంతో అంజలి సింగ్ స్నేహితురాలు కిందపడి పోగా అంజలి సింగ్ కాలు మాత్రం ఆ కారు కింద భాగంలో ఇరుక్కుపోయింది. దీనిని గమనించని ఆ కారు డ్రైవర్.. దాదాపుగా 13 కిలో మీటర్ల వరకు అలాగే అంజలి సింగ్ ను ఈడ్చుకెళ్లిపోయారు. ఒక గంటన్నర తర్వాత ఓ చోట అంజలి సింగ్ శరీరం తీవ్రగాయల పాలై బట్టలు లేకుండా రోడ్డుపై దర్శనమిచ్చింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించి ఘటనా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో ఆ యువతిని కారు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ తర్వాత ఆ కారులో ఉన్న నలుగురు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని సైతం విచారించారు. అయితే తాజాగా వచ్చిన పోస్ట్ మార్టం ఆధారంగా ఆ యువతిపై అత్యాచారంతో పాటు ఎలాంటి దాడి జరగలేదని పోలీసలు తేల్చారు. కానీ ఈ ఘటనపై ఇంకా చాలా మంది అనేక అనుమానాలు కల్గుతున్నాయి. ఇదే ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.