రైల్వే శాఖలో ఇంజినీర్ గా పనిచేసే ఓ వ్యక్తి .. ఏకంగా రైలు ఇంజిన్ నే అమ్మేసిన ఘటన బిహార్ లో జరిగింది. పుర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్తిపుర్ లోకో డీజిల్ షెడ్ లో రాజీవ్ రంజన్ ఝా ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. పుర్ణియా స్టేషన్ లో.. చిన్నరైల్వే ట్రాక్ పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్ కు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అవి జిల్లా పైఅధికారుల నుంచి వచ్చినట్లుగా నమ్మించాడు రాజీవ్ రంజ్.
అనంతరం డిసెంబరు 14న హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్ తో రైలు ఇంజిన్ ను ముక్కలుగా చేస్తూ కనిపించారు. ఇది గమనించిన అక్కడున్న కొంతమంది అధికారులు రాజీవ్ రంజన్ ప్రయత్నాన్ని అడ్డుకోగా.. నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్ షెడ్ కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని నమ్మించాడు.
అయితే.. కొంతమంది ఉద్యోగులు, స్టేషన్ మాస్టర్ అనుమానంతో డీజిల్ షెడ్ కు వెళ్లి చూడగా.. అక్కడ వారికి ఇంజిన్ పరికరాలు కనిపించలేదు. దీంతో స్టేషన్ మాస్టర్, ఉద్యోగులు కలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి.. రైల్వే ఆస్తులను కాపాడాల్సిన స్థానంలో ఉంటూ.. ఏకంగా రైలు ఇంజిన్ నే అమ్మేసిన ఈ ప్రబుద్దుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.