Crime News: ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి ఆసుపత్రి సిబ్బంది నరకం చూపించారు. లక్షల రూపాయల బిల్లు వేయటమే కాదు.. కట్టలేను అన్నందుకు చీకటి గదిలో బంధించి నరకం చూపించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని కెంగేరికి చెందిన సుజయ్ కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత సుజయ్ కోలుకున్నాడు.
ఇంటికి డిశ్చార్జ్ అయ్యే సమయంలో అతడికి పెద్ద షాక్ తగిలింది. దాదాపు 3 లక్షల 75 వేల రూపాయల బిల్లు వచ్చింది. అది చూసి అతడు నిశ్చేష్టుడయ్యాడు. అంత పెద్ద మొత్తం కట్టలేనని చేతులెత్తేశాడు. అయితే, ఆసుపత్రి యజమాన్యం అతడ్ని వదిలి పెట్టదల్చుకోలేదు. ఎలాగైనా డబ్బు రాబట్టాలనుకుంది. ఈ మేరకు సిబ్బందికి ఆజ్ఞలు జారీ చేసింది. సిబ్బంది సుజయ్‌ని ఆసుపత్రిలోని ఓ చీకటి గదిలో బంధించారు. దాదాపు 18 రోజులుగా అతడ్ని కొడుతూ, తిడుతూ డబ్బులు కట్టాలని హింసిస్తూ వస్తున్నారు. సుజయ్ తనపై జరుగుతున్న దాడిపై పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
పోలీసులు పట్టించుకోలేదు. చీకటి గదిలో తనపై జరిగిన చిత్ర హింసలను వీడియో తీసి పెట్టుకున్న అతడు దాన్ని ముఖ్యమంత్రికి, ఆరోగ్య మంత్రికి, నగర పోలీస్ కమిషనర్‌కు మెయిల్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడ్ని ఆసుపత్రినుంచి బయటకు తీసుకువచ్చారు. కోర్టుకు తరలించారు. సుజయ్‌పై దాడిపై ఆసుపత్రి యజమాన్యం స్పందిస్తూ తాము ఎవర్నీ బంధించలేదని, చిత్ర హింసలు పెట్టలేదని స్పష్టం చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.