దేశంలో ఎన్నో పథకాలు అమలలో ఉన్నాయి. దేని వల్ల ఎవరికి ఉపయోగం అన్నది తెలిస్తే చాలు.. బోలెడన్ని లాభాలు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. వీటిల్లో ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. ఈ పథకంలో ఎలా చేరాలి? ఎవరు అర్హులు? ప్రయోజనాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నెల నెలా జీతాలు అందడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. పీఎఫ్ ఖాతాలో జమైన డబ్బు.. ఉద్యోగ విరమణ తర్వాత చేతికందితే, ఏదైనా జబ్బు బారిన పడితే ఈఎస్ఐ సహాయపడుతుంది. మరి ఇళ్లలో పాచి పని, వీధుల్లో వ్యాపారం, రోజూ వారి కూలీలకుపరిస్థితి ఏంటి? ఇలాంటి మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దాని పేరే ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన(PM-SYM). ఈ స్కీమ్ ద్వారా శ్రామిక వర్గాలకు చెందిన ప్రజలు.. వృద్ధాప్య దశలో వచ్చే ఆర్థిక ఇబ్బందులను కొంత వరకు అదిగమించవచ్చు. ఈ పథకంలో చేరిన వారు.. వారి వయసును బట్టి నెలకు రూ. 55 నుండి రూ. 200 మధ్య చెల్లించవలసి ఉంటుంది. 60 సంవత్సరాలు దాటాక వీరికి క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుంది.
ఉదాహరణకు 30ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ స్కీంలో చేరితే.. నెల నెలా దంపతులిద్దరూ రూ.200 డిపాజిట్ చేశారు అనుకుందాం. అంటే ఈ లెక్కన వీరు ఏడాదికి రూ.2400 డిపాజిట్ చేయాలి. అలా 60ఏళ్లు వచ్చేవరకు డిపాజిట్ చేస్తూ వెళ్ళాలి. ఆ తరువాత అంటే 60 ఏళ్లు నిండాక ఆ భార్యాభర్తలిద్దరికీ నెల నెలా రూ.6వేల (ఒక్కరికి రూ.3000 లెక్కన) పెన్షన్ లభిస్తుందన్నమాట. ఈ లెక్కన ఏడాదికి రూ.72 వేలు పెన్షన్ అందుతుంది. ఈ సమయంలో ఒకవేళ చందాదారుడు మరణిస్తే.. అతడికి అందుతున్న పెన్షన్‌లో దాదాపు 50శాతం డబ్బులు కుటుంబ పెన్షన్‌గా లబ్ధిదారుడి భాగస్వామికి అందుతాయి.
అసంఘటిత రంగాల కార్మికులు మాత్రమే ఈ పథకంలో చేరడానికి అర్హులు. చందాదారుడి వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ కచ్చితంగా కలిగి ఉండాలి. ఔత్సాహికులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా.. తదితర వివరాలతో స్థానికంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్(CSC)ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో రిజిస్టర్ కావొచ్చు.