క్రెడిట్ కార్డు.. బ్యాంకు అకౌంట్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇప్పుడు అన్నీ సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో అయితే క్రెడిట్ కార్డు రావాలంటే పెద్ద ప్రహసనమనే చెప్పాలి. కానీ, ఇప్పుడు మారుతున్న జీవనశైలి, అవరాల దృష్ట్యా ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం బ్యాంకులు ఎంతో సులభతరం చేశాయి. మినిమం డాంక్యుమెంటేషన్‌తో క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. అంతేకాకుండా వారి వాడకాన్ని బట్టి వివిధ రకాల ఆఫర్లు, క్రెడిట్ లిమిట్ పెంచడం లాంటివి కూడా చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు అయితే గంటల వ్యవధిలోనే క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. అందుకని ఎంతోమంది ఎగబడి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ, చాలామందికి అసలు క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించాలో కూడా తెలియక నానా ఇబ్బందులు పడుతుంటారు.
క్రెడిట్ కార్డులు మంజూరు చేసి మీకు 40 రోజుల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు అంటే వాటిలో కూడా బ్యాంకులకు ఆదాయం ఉంటుంది. అంటే మీరు చేసే చెల్లింపులే వారికి ఆదాయ మార్గాలు. మీరు చేసే చెల్లింపులను వాయిదాల్లోకి కూడా మార్చుకోవచ్చని మీకు తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు ఏదైనా పెద్దమొత్తంలో కొనుగోలు చేసినప్పుడు బ్యాంకు వాళ్లు మీకు కాల్ చేసి మరీ ఈఎంఐలోకి మార్చుకోండని చెబుతుంటారు. అందుకు వాళ్లు ప్రాసెసింగ్ ఫీజ్, వడ్డీలను కూడా ఛార్జ్ చేస్తుంటారు. అవి బ్యాంకులు మారితే ఆ మొత్తాలు మారిపోతుంటాయి. కానీ, మీరు చేసే చాలా చెల్లింపుల్లో కొన్నింటిని మాత్రం ఇలా ఈఎంఐలలోకి మార్చలేరు అనే విషయం మీకు తెలుసా? చాలా మందికి ఇది తెలియకపోవచ్చు.
మీరు క్రెడిట్ కార్డుతో చేసే అన్ని చెల్లింపులను ఈఎంఐలలోకి మార్చుకోలేరు. అందుకు కొన్ని షరతులు, నిబంధనలు ఉన్నాయి. వాటిలో బంగారం ముఖ్యంగా ఉంటుంది. అవును బంగారం, వజ్రాలు, ఆభరణాలను మీరు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే వాటిని మీరు ఈఎంఐల కిందికి మార్చలేరు. పొరపాటున కూడా మీరు బంగారం కొంటే దానిని మొత్తం బిల్లుగా చెల్లించాల్సిందే. నిజానికి 2013కి ముందు వరకు క్రెడిట్ కార్డుతో బంగారం కొంటే ఈఎంఐగా మార్చేవారు. కానీ, బంగారం రిటైల్ కొనుగోళ్లను కట్టడి చేసేందుకు ఆర్బీఐ 2013లో క్రెడిట్ కార్డుతో కొనే బంగారాన్ని ఈఎంఐలోకి మార్చకండని నిబంధనలు తీసుకొచ్చింది. 2018లోనూ మరోసారి క్రెడిట్ కార్డుతో చేసే బంగారం చెల్లింపులను ఎట్టిపరిస్థితుల్లో ఈఎంఐగా మార్చొద్దని నొక్కి చెప్పింది.
ఆయిల్.. అంటే మీరు పెట్రోల్ బంకుల్లో చేసే చెల్లింపులను వాయిదాల్లోకి మార్చుకోలేరనమాట. క్రెడిట్ కార్డులు వచ్చిన కొత్తలో అయితే పెట్రోల్ బంకుల్లో నగదు తీసుకుని వాటిని ఈఎంఐలుగా మార్చుకునేవారు కూడా. కానీ, ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదు. పెట్రోల్ బంకుల్లో క్రెడిట్‌కార్డుతో చెల్లింపులు చేస్తే దానిని ఈఎంఐగా మార్చలేరు. అంతేకాకుండా కొన్ని నగదు లావాదేవీలను సైతం మీరు ఈఎంఐగా మార్చలేరు. అందుకు కొన్ని బ్యాంకులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని పాత కొనుగోళ్లను కూడా మీరు ఈఎంఐలోకి మార్చలేరు. అంటే మీరు ఒక వస్తువుని క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన తర్వాత ఒక నిర్దిష్ట గడువు తర్వాత ఈఎంఐగా మార్చలేరు. అంటే కొన్ని బ్యాంకులు ఆ గడువును 60 రోజులు పెట్టవచ్చు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు అయితే ఆ గడువును 30 రోజులకే కుదించారు. 30 రోజులు దాటితే ఆ చెల్లింపులను మీరు ఈఎంఐలుగా మార్చలేరు.