బంగారంపై రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి.
బంగారం అంటే ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు. చుట్టాలు, చుట్టుపక్కనోళ్లు, సన్నిహితులు, స్నేహితులు, ఎవరూ సాయం చేయలేని సమయంలో నేనున్నా బంగారం అంటూ ఆదుకుంటుంది. నన్ను ఏ బ్యాంకులో అయినా పెట్టుకొని డబ్బు తెచ్చుకోమని అంటుంది. బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టడం విషయం కాదు, ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఇస్తున్నారన్నదే విషయం. ఏ బ్యాంకైనా పర్లేదని, వడ్డీ ఎంతైనా పర్లేదని బంగారం మీద లోన్ తెచ్చుకుంటే వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడాలి. ఆ తర్వాత బంగారం పోయిందని బాధ పడాలి. అందుకే ఒకసారి ఏ బ్యాంకులో గోల్డ్ లోన్ మీద ఎంత వడ్డీ ఉందో తెలుసుకుంటే పోలే.
మిగతా బ్యాంకులతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకులో 7.20 శాతం నుంచి 16.50 శాతం వరకూ వడ్డీతో బంగారంపై రుణాలు ఇస్తోంది. అంటే నూటికి 60 పైసల నుంచి రూ. 1.30 వరకూ వడ్డీ ఉంటుంది. లక్ష రూపాయల రుణం తీసుకుంటే గనుక మీరు లక్షకు రూ. 600 నుంచి రూ. 1300 వరకూ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువే. 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. జీఎస్టీ లేదు. బంగారం నాణ్యత, మీ క్రెడిట్ హిస్టరీ, తీసుకునే లోన్ బట్టి వడ్డీ రేటు అనేది 7.20 శాతం నుంచి 16.50 శాతం మధ్యలో ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ తర్వాత తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలు ఇస్తున్న బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు. ఈ బ్యాంకు గోల్డ్ మీద 8 శాతం నుంచి 17 శాతం వరకూ రుణం ఇస్తోంది. అంటే నూటికి 66 పైసల నుంచి రూ. 1.41 వడ్డీ తీసుకుంటుంది. లక్ష రూపాయల గోల్డ్ లోన్ తీసుకుంటే గనుక మీరు లక్షకు రూ. 660 నుంచి రూ. 1410 మధ్యలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు తీసుకునే రుణం మీద 2 శాతం వరకూ ఉంటుంది. అదనంగా జీఎస్టీ వసూలు చేయబడుతుంది.
హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకుల తర్వాత తక్కువ వడ్డీకి బంగారంపై లోన్ ఇచ్చే బ్యాంకు ఉందంటే అది సౌత్ ఇండియన్ బ్యాంకే. ఈ బ్యాంకు బంగారు ఆభరణాలపై 8.25 శాతం నుంచి 19 శాతం వరకూ వడ్డీ వేస్తుంది. నూటికి 68 పైసల నుంచి రూ. 1.58 వరకూ వడ్డీ ఉంటుంది. లక్ష రూపాయల బంగారంపై రుణం తీసుకుంటే గనుక రూ. 687.50 నుంచి రూ. 1583 వరకూ వడ్డీ అనేది ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకూ ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం మీద ఇచ్చే రుణంపై 8.45 శాతం నుంచి 8.55 శాతం వరకూ వడ్డీ తీసుకుంటుంది. నూటికి 70 పైసల నుంచి 71 పైసలు వడ్డీ వేస్తుంది. లక్ష రూపాయల గోల్డ్ లోన్ తీసుకుంటే గనుక రూ. 704.16 నుంచి రూ. 712.50 వరకూ వడ్డీ అవుతుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు అయితే లోన్ మీద 0.50 శాతం వసూలు చేస్తుంది. మిగతా బ్యాంకులతో పోలిస్తే ప్రాసెసింగ్ ఫీజు తక్కువ.
ఫెడరల్ బ్యాంకులో బంగారం మీద 9.49 శాతం వడ్డీతో రుణం ఇస్తోంది. అంటే నూటికి 79 పైసలు వడ్డీ వసూలు చేస్తుంది. లక్ష రూపాయల లోన్ తీసుకుంటే గనుక రూ. రూ. 790 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
వ్యాపారం ప్రారంభించడం కోసమో, ఇతర అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులను సంప్రదించడం ఉత్తమం. బయట ఫైనాన్షియర్ల దగ్గర గానీ బయట వ్యక్తుల వద్ద గానీ బంగారంపై రుణం తీసుకుంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా బంగారంపై భద్రత అనేది ఉండకపోవచ్చు. అదే బ్యాంకులో ఐతే బంగారం భద్రంగా ఉంటుంది. మీ బంగారం భద్రంగా ఉండడంతో పాటు తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్లు ఇస్తున్నాయి కాబట్టి బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టడం అనేది మంచి మార్గం.