మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ప్రైవేటు కొలువులకు ఉండదనేది నిజం. జాబ్ సేఫ్టీతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లాంటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టే సర్కారీ నౌకరీలకు అంత డిమాండ్. ఐటీ లాంటి ఒకట్రెండు రంగాలను మినహాయిస్తే ప్రైవేటు సెక్టార్‌లో ఎక్కువ జీతం ఇచ్చేవి తక్కువే. అదే టైమ్‌లో పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులకు పెద్దగా ఉండేవి కావు. అలాంటిది ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తోంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) సంస్థ.
ఉద్యోగుల భవిష్యత్ అవసరాలు తీర్చడం, వారికి సామాజిక భద్రతను కల్పించడం వంటి ఎన్నో సౌకర్యాలను ఎంప్లాయీస్‌కు ఈపీఎఫ్‌ఓ అందిస్తోంది. అలాంటి ఈ సంస్థలో సభ్యులు 58 నుంచి 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత నుంచి ప్రతి నెలా పింఛను అందుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఉద్యోగుల భవిష్య నిధితోపాటు, పెన్షన్ స్కీమ్ (ఈపీఎఫ్‌ఓ 95) కూడా ఒకే ఖాతా కింద కొనసాగుతుంటాయి. అయితే ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఒకటి.. ఎంప్లాయి దురదృష్టవశాత్తూ మరణిస్తే, అతడి మీద ఆధారపడిన కుటుంబం లేదా తల్లిదండ్రులు బతికినంత కాలం పింఛను పొందేందుకు అర్హులు. ఉద్యోగిని కోల్పోయిన పేరెంట్స్‌కు జీవించి ఉన్నంత కాలం పింఛను ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.
ఈపీఎఫ్‌ఓ షరతుల్లో ప్రధానమైనది ఎంప్లాయి చనిపోయే నాటికి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగా ఏదైనా ప్రమాదం లేదా వ్యాధి కారణంగా వైకల్యం పాలైనా.. జీవించి ఉన్నంత కాలం పింఛన్‌కు అర్హులు. ఎంప్లాయి పనిచేయలేని విధంగా వైకల్యం పాలైతే పింఛను పొందేందుకు 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలన్న రూల్ లేదు. మరో విషయం ఏంటంటే.. ఉద్యోగి వేతనం నుంచి (మూలధనం, డీఏ కలిపి గరిష్టంగా రూ.15,000) 12 శాతం ఈపీఎఫ్‌ఓకు వెళ్తుంది. కంపెనీ లేదా ఎంప్లాయి తరఫున 12 శాతం చందా అందుతుంది. అందులో 8.33 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం పింఛను ఖాతాకు వెళ్తుంది. దీని నుంచే పెన్షన్ చెల్లింపులు చేస్తారు.